ఎట్టకేలకు హాథ్రస్‌ బాధితుల వాగ్మూలం నమోదు

లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):దేశమంతటినీ కుదిపేస్తున్న హాథ్రస్‌ హత్యాచార ఘటనపై బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేడు బుల్‌గడీ గ్రామానికి చేరుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించినప్పటికీ.. సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధిత కుటుంబం సీబీఐ విచారణకు కూడా అంగీకరించడం లేదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. బాధిత కుటుంబం న్యాయ విచారణ కోరుతుంటే ఇంకా సిట్‌తో కాలయాపన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐకి అప్పగించిన తర్వాత సిట్‌ వివరాలు సేకరించాల్సిన అవసరం ఏముందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందా అని నిలదీశారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్‌ బెదిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై యూపీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆయన అక్కడే ఉంటే సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎలా కొనసాగుతుందని నిలదీశారు. ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ప్రియాంక గాంధీ సైతం కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్ర వర్ణాలకు చెందిన నిందితుల్ని ఆయన కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఐదుగురు వ్యక్తులతో కూడిన బృందాలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బాధితుల్ని పరామర్శించవచ్చని తెలిపారు. నేడు భీం ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ బాధిత కుటుంబాన్ని కలవనున్నారు. ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌధరి సైతం నేడు బుల్‌గడీలో పర్యటించనున్నారు. మరోవైపు హాథ్రస్‌ జిల్లా ఎస్పీ వినీత్‌ జైశ్వాల్‌ అత్యాచారం జరిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ ఘటనకు వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వారణాసిలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడ నిరసన తెలుపుతున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మరోవైపు నిందితుల పక్షాన కొంతమంది గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నలుగురు నిందితుల్లో కొందరు అమాయకులు ఉన్నారని.. కేవలం రాజకీయాల కోసమే దీన్ని పెద్దదిగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఓ ఇంట్లో సమావేశం నిర్వహించారు.