కోలుకుంటున్న ట్రంప్‌..

-  ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం
వాషింగ్టన్‌,అక్టోబరు 4(జనంసాక్షి): తన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వీలైనంత త్వరగా తాను తిరిగి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తన క్షేమ సమాచారాలు తెలియజేస్తూ శనివారం సాయంత్రం నాలుగు నిమిషాల నిడివి గల ఓ వీడియోను ట్వీటర్‌ వేదికగా విడుదల చేశారు. కరోనా బారిన పడ్డ ఆయన ప్రస్తుతం వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.   ''నేను ఇక్కడకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం అంత బాగాలేదు. ఇప్పుడు చాలా మెరుగ్గా అనిపిస్తుంది. నేను కోలుకునేందుకు అందరం కలిసి శ్రమిస్తున్నాం. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా నిలపాలంటే నేను వీలైనంత త్వరగా తిరిగి రావాలి. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయాలి. నేను ఇప్పుడు వైరస్‌తో పోరాడుతున్నాను. దాన్ని ఎలాగైనా ఓడిస్తాను. నేను కొన్ని ఔషధాల గురించి మాట్లాడినప్పుడు నాపై విమర్శలు గుప్పించారు. కానీ, ఇప్పుడు అవే దేవుడు చేసిన అద్భుతాలు అన్నట్లు పనిచేస్తున్నాయి. వాటి వల్లే నేను ఇప్పుడు మెరుగయ్యాను. రాబోయే కొన్ని రోజులే 'అసలు పరీక్ష'. ఏం జరుగుతుందో చూడాలి. ఈ సమయంలో అన్ని వర్గాల నుంచి నాకు మద్దతు లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మెలనియా సైతం ధైర్యంగా పోరాడుతోంది. త్వరలోనే తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో విూ ముందుకు వస్తాం'' అని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులు సమాచారం అందజేస్తున్నప్పటికీ అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ట్రంప్‌కు అదనపు ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోందన్న వార్త బలంగా వినిపిస్తోంది. దీనిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కాన్లే వివరణ ఇచ్చారు. వైరస్‌ సోకిందని తెలియగానే.. ఆస్పత్రిలో చేర్చడానికి ముందు అదనపు ఆక్సిజన్‌ అందజేశామని తెలిపారు. తర్వాత ఆ అవసరం రాలేదన్నారు. గత 24 గంటల్లో ఆయనకు జ్వరం ఏవిూ రాలేదని వెల్లడించారు. అయితే, పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డారని కూడా చెప్పలేమన్నారు. మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ అందిస్తున్నామన్నారు. వైరస్‌ నిర్ధరణ అయినప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రంప్‌ ఆరోగ్యం మెరుగైందన్నారు. మరోవైపు ట్రంప్‌ ఆరోగ్యంపై శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి మార్క్‌ విూడోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిని తెలిపే కొన్ని కీలకమైన సంకేతాలు గత 24 గంటల్లో కొంత ఆందోళన కలిగించాయని.. రాబోయే 48 గంటలు చాలా కీలకమన్నారు.