- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
మోఘా,అక్టోబరు 4(జనంసాక్షి): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం కొంతమంది కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. పంజాబ్‌లో రైతులకు మద్దతుగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి పీడిస్తున్న వేళ ఈ వ్యవసాయ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి, కనీస మద్దతు ధరకు మంగళం పాడడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మూడు చట్టాలను రద్దు చేసి బుట్టదాఖలు చేస్తామని హావిూ ఇచ్చారు. గత ఆరేళ్లుగా ప్రధాని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్, నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, పార్టీ నేతలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ ర్యాలీలు కొనసాగనున్నాయి.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయచట్టాన్ని రద్దు చేస్తాం