నగరంలో పారిశుద్ద్యానికి ప్రత్యేక శ్రద్ద


ఘన వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగింపు


కంప్యాక్టర్‌ వాహనాలను ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): నగరాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేయడంలో ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో పారిశుద్యానికి ప్రాధాన్యం పెరిగిందని, ప్రజలు కూడా ఆరోగ్యంపై శ్రద్దగా ఉంటున్నారని అన్నారు. ఈ క్రమంలో నగరంలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని అన్నారు. నగరంలో భవన నిర్మాణవ్యర్థాలను తరలించేందుకు 50 కంప్యాక్టర్‌ వాహనాలను మంత్రి కేటీఆర్‌ గురువారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్‌ ఆదర్శంగా ఉందన్నారు. ఒక్కో వాహనంలో 15 మెట్రిక్‌ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటి నుంచి చెత్తసేకరణ కార్యక్రమం చేపట్టామని, హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పరిచామన్నారు. ప్రస్తుతం 2వేల స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందన్నారు. త్వరలోనే మరో 2,700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్‌ వాహనాల ద్వారా ఉపయోగం ఉంటుందని అన్నారు. కంప్యాక్టర్‌ వాహనాల ద్వారా భవన నిర్మాణాల వ్యర్థాలను తరలించనున్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీ 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఒక్కో వాహన సామర్థ్యం 20 క్యూబిక్‌ విూటర్లు కాగా, అందులో 15 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తరలించవచ్చు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం వ్యర్థాలను పూర్తిగా కప్పి ఉన్న వాహనంలోనే తరలించాలి. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల వద్ద సైతం చెత్త కనిపించ కుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టు సంస్థ రాంకీ ఎన్వీరో సంయుక్తంగా పలు ఆధునిక విధానాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆధునిక కాంప్యాక్టర్‌ వాహనాలు, చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద జరిగిన ఈకార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.