ఫిబ్రవరి 11న మేయర్‌ ఎన్నిక

 - నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ

హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆర్‌.పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌.. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నోటిఫికేషన్‌తో పాటు ఎన్నికకు సంబంధించిన విధానపరమైన సూచనలను వెల్లడించింది.పరోక్ష ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు గ్రేటర్‌ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ప్రిసైడింగ్‌ అధికారి ఫిబ్రవరి 6వ తేదీలోపు ప్రత్యేక సమావేశం నోటీసును కార్పొరేటర్లకు జారీ చేయాలి. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో తొలుత మేయర్‌.. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపడతారు. ఏవైనా కారణాలతో ఫిబ్రవరి 11న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షణకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పరిశీలకునిగా ఎస్‌ఈసీ నియమించనుంది.