సీరమ్‌ ఇనిస్టిట్యూట్లో లో అగ్నిప్రమాదంఐదుగురు మృతి

టీకా తయారీకి డోకా లేదు

పుణె  జనవరి 21 (జనం సాక్షి):  

 ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం విషాదం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌- 3 భవనం లోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడి ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లను రంగంలోకి దించారు. దాదాపు రెండు గంటలుగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

ఈ ఘటనపై సీరమ్‌ సంస్థ అధినేత అదర్‌ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. ''ఇప్పుడే కొన్ని బాధను కలిగించే అప్‌డేట్స్‌ వచ్చాయి. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు కొంత ప్రాణనష్టం జరిగినట్టు తెలిసింది. చాలా బాధపడుతున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం'' అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అక్కడే మరోసారి చెలరేగిన మంటలు

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సాయంత్రం మరోసారి మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం చెలరేగిన మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయనుకొనే లోపే మరోసారి మంటలు రావడం కలకలం రేపింది. తొలుత ప్రమాదం జరిగినచోటే మళ్లీ మంటలు చెలరేగడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఘటనపై మోదీ, ఉద్ధవ్‌గ్భ్భ్రాంతి

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందడం బాధాకరమన్నారు. గాయాలపాలైన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌లు విచారం వ్యక్తం చేశారు.

కరోనాపై పోరులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్‌ టీకాలు తయారవుతున్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.