సహనానికి హద్దు ఉంటుంది జాగ్రత్త!మా మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ

తెలంగాణ కోసం సిఎంలనే ఉరికించిన చరిత్ర మాది

తెలంగాణ తేకుంటే రాళ్లతో కొట్టండన్న లీడర్‌ కెసిఆర్‌

కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు

అందరి చిట్టాలు మావద్ద ఉన్నాయ్‌..జాగ్రత్తా

టిఆర్‌ఎస్‌వి సమావేశంలో బిజెపికి  కెటిఆర్‌ ఘాటు హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): తెలంగాణ కోసం ఎత్తిన కాడి దించకుండా పోరాడి, తెలంగాణ సాధించిన   సీఎం కేసీఆర్‌పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు విూడియా, మనీ, మజిల్‌ పవర్‌ లేదని.. కొందరు నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధనలో విజయం సాధించారని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఒక్కరు కూడా వెంటరాలేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ది సీఎంలను ఉరికించిన చరిత్ర అని, తమ మౌనాన్ని బలహీనంగా భావించొద్దన్నారు. గోడకు వేలాడదీసే తుపాకీ సైతం మౌనంగానే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో యావత్‌ తెలంగాణకు తెలుసన్నారు. సీఆర్‌ కులబలం, మజిల్‌ బలం లేకుండానే ప్రయాణం ప్రారంభించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.  తెలంగాణ సాధన కోసం తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి తెలంగాణ జెండా పట్టారన్నారు. రాష్ట్రం వచ్చేవరకు పోరాటం చేయకపోతే రాళ్లతో కొట్టండన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ అని, ఆయన కష్టంతో తెలంగాణ వచ్చిందన్నారు. దేశంలో సగర్వంగా నిలబడిందని చెప్పారు. అలాంటి నేతపై ఉద్యమంలో అడ్రస్‌ లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ మాట్లాడే బఫూన్‌ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని.. వాళ్లకంటే చీల్చి చెండాడే సత్తా తమకుందని పరోక్షంగా బిజెపి నేతలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ నేతలది వాట్సప్‌ యూనివర్సిటీ అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏవిూ తెలియదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. దేశంలో 150 మెడికల్‌ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష? ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదు..  మన్ను లేదన్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని.. వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదన్నారు. అందరి లెక్కలు రాస్తున్నామని, మిత్తితో చెల్లిస్తామన్నారు. ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదన్నారు.  ఏప్రిల్‌ 27 నాటికి టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 2 దశాబ్దాలని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు. 'వాట్సప్‌ వర్సిటీలో బీజేపీ నాయకులు అబద్దాలు నేర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్దాలు వ్యాప్తి చేస్తున్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ చేసింది గుండు సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కూడా దక్కలేదు. కొత్త వైద్య కళాశాలల్లోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపిన బీజేపీకి ఓటేందుకు వేయాలన్నారు. విశాఖలో ఉక్కు పరిశ్రమను మూసేస్తున్న వారు బయ్యారంలో పరిశ్రమ కడతారా అని ఒకడు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు. అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు తడాఖా చూపుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు ద్వారా బీజేపీకి సమాధానం చెప్పాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.