వచ్చేవారం ఈటెల బిజెపిలో చేరిక


 మంచి రోజు కోసం ముహూర్తం కోసం చూపు

ఈటలకు దొరకని స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌
హుజూరాబాద్‌లో వేడెక్కనున్న పివి జిల్లా డిమాండ్‌
హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): తెరాసతో తెగతెంపులు చేసుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరికకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. మంచిరోజున ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కుటుంబసభ్యులతో చర్చించిన ఆయన.. ఈ నెల 13, 14 తేదీల్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ద్వారా జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, మరికొందరు భాజపాలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల మంగళ లేదా బుధవారం రాజీనామా చేసే అవకాశం ఉంది. గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, అందుబాటులో ఉంటే అసెంబ్లీ స్పీకర్‌కు లేదా ఆయన కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని ఈటల భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈటెలకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదని తులుస్తోంది. ఇదిలావుంటే ఇప్పుడు హుజూరాబాద్‌ కేంద్రంగా మాజీ మంత్రి పీవీ నర్సింహారావు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాక ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.ఆయన స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించాలని నిర్ణయించడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల అనివార్యమవుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో గెలువడం అటు టీఆర్‌ఎస్‌కు, ఇటు ఈటలకు ప్రతిష్టాత్మకం కావడంతో అప్పుడే రాజకీయాలు వేడెక్కు తున్నాయి. ఉప ఎన్నికలు జరుగడానికి ఆరు నెలల గడువు ఉన్నా ఇప్పటికే ఇక్కడ ఎన్నికల వాతావరణం రూపుదిద్దుకున్నది. ఇదే నేపథ్యంలో హుజూరాబాద్‌ జిల్లా తెరపైకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం, ఈటల ఇప్పటి నుంచే ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రూపొందించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. స్థానిక ప్రజాప్రతినిధులకు పార్టీల్లో క్రియాశీలకంగా ఉండే నేతలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. వారిని తమ చేజారి పోకుండా చూసుకునేందుకు టీఆర్‌ఎస్‌, వారి మద్దతు కూడగట్టు కునేందుకు ఈటల వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే దీనిని తట్టుకునేందుకు అనేక అభివృద్ది పనులకు గాను అధికార పార్టీ నేతలు మావిూలు గుప్పిస్తున్నారు. చిన్న, మధ్యతరహా పంచాయతీల్లో 20 లక్షలతో, మేజర్‌ పంచాయతీల్లో 30 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హావిూ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సమస్యలను కూడా తెలుసుకొని వారికి చేదోడువాదోడుగా ఉంటామని సంతృప్తిపరిచే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు తమవైపు మొగ్గుచూపకుండా చూసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ 50 కోట్ల రూపాయల ఆశ చూపించిందని మాజీ మంత్రి ఈటల ఆరోపిస్తుండగా అలాంటి ప్రయత్నాలకు ముందుగా శ్రీకారం చుట్టిందే ఆయన అని టీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. అటు టీఆర్‌ఎస్‌, ఇటు ఈటల ప్రయత్నాలు ఎలా ఉన్నా కొందరు ఈ ఎన్నికల నేపథ్యంలో పివి జిల్లాతో సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.