మోజంజాహి తరహాలో మోండా అభివృద్ది

 


మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): ఎంతో చరిత్ర కలిగిన మొండా మార్కెట్‌ను అభివృద్ది చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఇటీవల అభివృద్ధి చేసిన మొజంజాహీ మార్కెట్‌ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసాని, మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తో కలిసి మొండా మార్కెట్‌ లో విస్తృతంగా పర్యటించారు. మార్కెట్‌ అభివృద్ధి కి చేపట్టవలసిన చర్యలు, మార్కెట్‌ కు ఉన్న ప్రాధాన్యత, చరిత్రను మంత్రి వివరించారు. నిజాం నవాబు కాలంలో నిర్మించిన ఈ మార్కెట్‌ లో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తున్నారని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి వివరించారు. వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈ మార్కెట్‌ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా పాత ఓల్డ్‌ జైల్‌ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టి లెవెల్‌ పార్కింగ్‌ ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారుల ఇబ్బందులు, ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా పాలికా బజార్‌ చౌరస్తా నుండి మొండా మార్కెట్‌ లోని కూరగాయల బజార్‌ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, పాత గాంధీ హాస్పిటల్‌ గోదాం ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్‌ ఎª`లానింగ్‌ సీసీపి దేవేందర్‌ ను మంత్రి ఆదేశించారు. మార్కెట్‌ ను ఇక్కడి నుండి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేటర్‌ దీపిక, వాటర్‌ వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ మహేందర్‌ తదితరులు ఉన్నారు.