ఆన్‌లైన్‌ చదువులతో సాధించిందేవిూ లేదు


 ప్రత్యక్ష బోధన సాగితేనే పిల్లలకు మేలు

మానిసిక నిపుణులు, తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే
అయితే తగిన రక్షణ చర్యలు ప్రాథమిక లక్ష్యం కావాలని వినతి
హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): కరోనా సంక్షోభంతో ఆన్‌లైన్‌ విద్యావిధానంలో పిల్లల్లో మానసిక ఎదుగుదల ఆగిపోగా..ఈ చదువులతో వారికి కొత్తగా అబ్బందేవిూ లేదని తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్‌ స్క్రీన్‌ కారణంగా కంటి సమస్యలు కూడా వచ్చాయని అన్నారు.
ఆన్‌లైన్‌ విధానంలో విద్యార్థులు సరిగా నేర్చుకోలేక పోతున్నారు. ప్రత్యక్ష బోధన అన్ని విధాలా మంచిదని చాలామంది తల్లిదండ్రులు అంటున్నారు. స్కూళ్లకు తమ పిల్లలను పంపడానికి సిద్దమే అయినా కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సూచిస్తున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య సంరోణ అవసరమని అన్నారు. ముందుగా 6 నుంచి 10వ తరగతి వరకు ప్రారంభించి ఫలితాలు బాగుండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుంటే అప్పుడు వారం తర్వాత ప్రాథమిక తరగతులు ప్రారంభిస్తే బాగుంటుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ మహమ్మారి ప్రవేశించి ఏడాదిన్నర అయింది. పోయిన విద్యాసంవత్సరం అంతా ప్రత్యక్ష తరగతులు లేవు. తప్పనిసరి తరగతులకు తప్ప పరీక్షలు లేవు.
ఇళ్లల్లో బందీలుగా మారిన పిల్లలు, పదిమందిలో మెలిగే అవకాశం లేక చిరాకుగా ఉంటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల ప్రయోజకత్వం అంతగా లేదని కూడా తెలిసి వచ్చింది. అది ఉన్నతవిద్యాకు మాత్రం కొంత దోహదపడుతుందన్నారు.ఆన్‌లైన్‌తో పిల్లలకు కళ్లసమస్యలు, మానసిక సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఎదిగే పిల్లల మనస్సులపై, తెలివితేటలపై దుష్పభ్రావాలు పడే అవకాశముందని మానసిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అందువల్లనే, వెంటనే తరగతులు ప్రారంభిస్తే బాగుండునన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వాలు వెంటనే అందుకు తగ్గట్టుగా స్పందించి విద్యాసంస్థల పునఃప్రారంభానికి పూనుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచే ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నిటిని తెరిచారు. ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని తెరచుకున్నాయి. మరి కొన్ని ఇంకా పరోక్ష విద్యాబోధననే కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి కేజీ నుంచి పీజీ దాకా విద్యాసంస్థలన్నీ తెరుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష తరగతుల పునఃప్రారంభం నేపథ్యంలో తీసుకోవలసిన కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలను, మార్గదర్శకాలను ప్రకటించారు. పాఠశాలలు పునః ప్రారంభించాలంటే కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామన్న భరోసా కల్పించాలని తల్లిదండ్రలుతో పాటు, విద్యారంగ నిపుణులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతానికి కొవిడ్‌ ఉధృతి తగ్గినప్పటికీ, అది పూర్తిగా వైదొలగలేదు. మూడవ విడత, నాల్గవ విడత మళ్లీ విజృంభించవచ్చునని హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయని అన్నారు. ఇంకా 30`, 40 శాతం ప్రజలు ఇంకా వ్యాధివ్యాప్తికి అందుబాటులో ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. టీకాకరణ వేగంగా జరగకపోవడం వల్ల, వైరస్‌ కొత్త ఉత్పరివర్తనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. పద్దెనిమిదేండ్ల లోపు వారికి టీకాలు వేసే కార్యక్రమం ఇంకా దేశంలో ప్రారంభం కాలేదు. విద్యాసంస్థలంటే పిల్లలు, టీచర్లు, ఇతర సిబ్బంది కనుక వీరందిరికి వ్యాక్సినేషన్‌ జరగాలి. ఈ నేపథ్యంలో వ్యాధివ్యాప్తికి అవకాశమిచ్చే కార్యక్రమాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం వ్యాధి ఉధృతి తగ్గింది కాబట్టి, పాఠశాలలను ప్రారంభించ వలసిందే కానీ, ఎంపిక చేసిన చోట్ల మాత్రమే ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పాఠశాల లను ప్రయోగపద్ధతిని ప్రారంభించి ఫలితాలను పరిశీలించడం మంచిదన్న అభిప్రాయం కూడా ఉంది. మొదట ఉన్నతస్థాయి విద్యాసంస్థలను తెరిస్తే మంచిదన్న అభిప్రాయం కూడా ఉంది. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్త సిబ్బంది, బడి వాహనాల డ్రైవర్లతో సహా, టీకాలు వేయించు కుని తీరాలని నిబంధన పెట్టడం మంచిదంటున్నారు. పాఠశాలలు తెరిచే పక్రియను ప్రారంభించినందున తగిన జాగ్రత్తలతో, దశల వారీగా, నిపుణుల పర్యవేక్షణలో సాగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.