వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు


చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం

అధికారులతో సవిూక్షలో మంత్రి గంగుల

కరీంనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పచ్చదనం పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ పనుల పురోగతిపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రి గంగుల కమలాకర్‌.. మేయర్‌ సునీల్‌ రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఆర్‌ అండ్‌ బీ, మున్సిపల్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. నగరంలో కురిసే చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్‌ పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయకుండా కట్టడి చేయాలని, పాదచారులు ఫుట్‌ పాత్‌లపై నడిచి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్మార్ట్‌ సిటీ బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించుకొని ఆర్‌ అండ్‌ బి, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అన్నారు. టవర్‌ సర్కిల్‌ ప్రాంతంలో స్మార్ట్‌ సిటీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులు, వ్యాపారులు కూరగాయలను మార్కెట్లలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని నివారించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు.