మిగులు టీకాలు ఎగుమతి చేస్తాం

 


 


` మూడు నెలల్లో 100 కోట్ల డోసులు అందుతాయి
` కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
దిల్లీ,సెప్టెంబరు 20(జనంసాక్షి):కరోనా నివారణ టీకాలను అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు, వ్యాక్సిన్ల విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడిరచారు. భారత ప్రజలకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాను వ్యాక్సిన్‌ ‘మైత్రి’ కార్యక్రమం, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్‌ మాసంలో 30 కోట్లకు పైగా డోసులు.. వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 100 కోట్లకు పైగా టీకా డోసులు అందుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు చెప్పారు. చివరి 10 కోట్ల డోసులు కేవలం 11 రోజుల్లోనే పంపిణీ జరిగిందని తెలిపారు. మన దేశ పౌరులకు వ్యాక్సిన్‌ అందించడమే తొలి ప్రాధాన్యమని స్పష్టంచేశారు. మన అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వ్యాక్సిన్‌ను వసుధైక కుటుంబం అనే నినాదానికి అనుగుణంగా అక్టోబర్‌`డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ మైత్రి, కోవాక్స్‌కు ఎగుమతులు, విరాళాలుగా ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనాపై ఉమ్మడి పోరాటంలో భాగంగా ఈ మిగులు టీకాలను ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా భారత్‌ తన నిబద్ధతను చాటుకొంటుందన్నారు. దేశీయంగా పరిశోధన, ఉత్పత్తికి సంబంధించి ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కొవిడ్‌ టీకాల పరిశోధన ఉత్పత్తి ఏకకాలంలో భారీ ఎత్తున కొనసాగుతున్నాయన్నారు. భారత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రపంచ దేశాలకు ఓ రోల్‌ మోడల్‌ అని, వేగంగా కొనసాగుతోందని తెలిపారు. గతంలో భారత్‌ దాదాపు 100 దేశాలకు 6.6కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను విక్రయాలు, విరాళం ద్వారా సరఫరా చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎగుమతులను నిలిపివేసింది.మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. టీకా లభ్యత పెరుగుతుండటంతో పంపిణీ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే దాదాపు 2.5కోట్ల డోసులకు పైగా టీకాలను పంపిణీ చేసి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.