మంత్రి కేటీఆర్ తో సమావేశమైన డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు హైదరాబాద్ జనం సాక్షి సెప్టెంబర్ 22

 

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు ఈరోజు మంత్రి కే. తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.  దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన దత్తాత్రేయను కలవడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతుల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల పైన మంత్రి కేటీఆర్ సమాచారం అందించారు. ఈ కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రభుత్వ అరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించాలని కేటీఆర్ తెలిపారు. 


తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించిన నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని, ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మంత్రి కేటీఆర్ కు తెలిపారు. తన వైద్య విద్య,  వృత్తి హైదరాబాదులోనే ప్రారంభమైందని ఇలాంటి రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు.