అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి

 


కాబూల్ : ఆప్ఘ‌నిస్ధాన్‌లోని మ‌సీదుపై దాడి ఘ‌ట‌న‌లో 100 మంది మ‌ర‌ణించారు. కుందుజ్‌లోని మ‌సీదుపై శుక్ర‌వారం ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురు గాయ‌ప‌డ్డారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌తో కుందుజ్ సెంట్ర‌ల్ ఆస్ప‌త్రి కిక్కిరిసిపోయింది.

ఈ ఘ‌ట‌న‌లో త‌మ ఆస్ప‌త్రికి ఇప్ప‌టికి 35 మృత‌దేహాలు తీసుకువ‌చ్చార‌ని, 50 మంది గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇక ఇత‌ర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతులు, క్ష‌త‌గాత్రుల బంధువుల రోద‌న‌ల‌తో కుందుజ్ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కుందుజ్ మ‌సీదులో పేలుడు ఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌ర‌ణించగా, పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు గాయాల‌య్యాయ‌ని తాలిబ‌న్ ప్ర‌తినిధి జ‌బిహుల్లా ముజ‌హిద్ తెలిపారు.