యాదాద్రి స్వర్ణతాపడం కోసం 3కిలోల బంగారం


ఇవోకు అంతేమొత్తంలో నగదు అందచేత

స్వయంగా యాదాద్రిలో ఇవోకు అందించిన మంత్రి మల్లారెడ్డి
యాదాద్రి,అక్టోబర్‌28  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం భారీగా విరాళాలు అందుతున్నాయి. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదును ఆలయ అధికారులకు మంత్రి మల్లారెడ్డి గురువారం ఉదయం అందజేశారు. మేడ్చల్‌ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరపున కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి. ఘట్‌కేసర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు యాదాద్రికి ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆ నగదును మంత్రి అందజేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 21న పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం స్వస్తిపుణ్యహవాచన పూజలతో మహాసుదర్శన యాగాన్ని నిర్వహిస్తా మని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. యాదాద్రి గోపుర స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని, తనవంతుగా కిలో బంగారాన్ని ఇస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సలహాలు, సూచనల మేరకు మహా సుదర్శన యాగాన్ని కూడా ప్రతిపాదించారు. ప్రధానాలయ పనులు తుదిదశకు చేరిన నేపథ్యంలో జీయర్‌ స్వామితో సమాలోచన చేసినట్లు తెలిపారు. జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం చేసుకున్న ఆలయాలను మహాకుంభ సంప్రోక్షణ పూజలతో పునఃప్రారంభిం చాలని, మహాసుదర్శన యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ లోగా స్వర్ణ తాపడం కూడా చేయాలని నిర్ణయించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి పూజలతో యాగ పరిసమాప్తి అవుతుంది. ఆరువేల మంది రుత్వికులు, నాలుగు వేల మంది సహాయకులతో 1008 కుండలాలతో మహాయాగాన్ని నిర్వహిస్తారు. జీయర్‌స్వామి పర్యవేక్షణలో కొండకింద పాత గోశాల ప్రాంతంలోని 100ఎకరాల్లో యాగాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తమ విరాళం ప్రకటించారు. విరాళాల కోసం క్యూ ఆర్‌ కోడ్‌ కూడా విడుదల చేశారు. తొలుతగా మంత్రి మల్లారెడ్డి గురువారం తాను ప్రకటించిన విరాళాన్ని ఇవో గీతకు అందచేయడం విశేషం.