హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా చేపట్టిన మూడో టీఎంసీ పనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం.. పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. అనుమతుల్లేకుండా మూడో టీఎంసీ పనుల కోసం రుణాలు తీసుకున్నారని.. భూసేకరణ, పనుల అప్పగింతలను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజులకు 180 టీఎంసీల ఎత్తిపోత నిమిత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి పొందిందన్నారు. అయితే, ఇదే అనుమతులతో అదనపు టీఎంసీ నిర్మాణ పనులు కొనసాగిస్తోందని చెప్పారు. మూడో టీఎంసీ పనులను ప్రత్యేకంగా పరిగణించాలని, అన్ని అనుమతులు తీసుకోవాల్సిందేనని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదని, ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఈ ఏడాది జులైలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ పేర్కొన్నట్లు ఇది కొత్తది కాదని, అనుమతులు పొందినదేనని చెప్పగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అనుమతులు అవసరమని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది కదా? అని ప్రశ్నించింది. వీటన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని.. గడువు కావాలని ఏజీ కోరారు. కౌంటర్లు దాఖలు చేసేదాకా పనులు నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా 2019లో పనుల విస్తరణకు జీవో జారీ చేశారని, ఇంతకాలం ఏం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్లు పరిశీలించాక ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.
మూడో టీఎంసీ పనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు