మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా


గ్రావిూణ ప్రాంతాల్లో పెరుగుతున్న తయారీ

గుట్టుచప్పుడు కాకుండా తయారీతో వ్యాపారం
మద్యం ధరలే కారణమంటున్న ప్రజలు
అమరావతి/హైదరాబాద్‌,అక్టోబర్‌21  జనం సాక్షి : జిల్లాలోని ప్లలెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. తెలుగు రాష్టాల్ల్రోని అనేక జిల్లాలో నాటుసారా తయారీ మళ్లీ జోరందుకుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. ఇటీవలి కాలంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా చూడాలి. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్టాల్ర నుంచి చీప్‌ లిక్కర్‌ రావాణా చేస్తూ ఎపిలో పట్టుబడుతున్న కేసులు అధికంగానే ఉన్నాయి. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి నల్ల బెల్లం తయారీని నిషేధించింది. దీంతో సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు
వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. హైదరాబాద్‌ ధూల్‌పేటలో గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపి ఆయా ప్రాంతాల్లో ఉపాధి పనులకు పెద్దపీట వేశారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి సారా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం గిరిజన ప్రాంతాలను ఆశ్రయించి ఇప్పపువ్వుతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని ప్లలెలో, తండాల్లో జోరుగా దందాను సాగిస్తున్నారు. గుడుంబా కేవలం ప్లలెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలన్నా రూ.100కు పైగానే ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా, సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రావిూణ ప్రాంతాల్లోనూ గుడుంబా అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారి కూలీ పనులు చేసుకుని బతికేవారు చాలా మంది సారా, గుడుంబా తాగుతున్నట్లు సమాచారం. నాటుసారా తయారు చేసే వారిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు. అయినా కఠిన చర్యలు తీసుకోక పోవడంతో మళ్లీ యధావిధిగా వ్యాపారం సాగిస్తున్నారు.