పోడు సమస్యలపై గిరిజనుల్లో ఉత్కంఠ

 

త్వరగా పరిష్కారం అవుతుందన్న ఆశ
వరంగల్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు గిరిజనుల్లో మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా లెక్కలు తీసి రెడీ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు సర్వే చేపట్టి భూ సమస్య పరిష్కరించడానికి సూచనలు చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల రోజుల క్రితం భూ సమస్యల పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ, హరితహారం వంటి అంశాలపై కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. దీంతో పోడు భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని చూపుతుందని గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తరచూ పోలీసుల సహాయంతో అటవీ శాఖ సిబ్బంది తమ భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి రావడం, మొక్కలు నాటడం వంటివి గోడవలకు దారి తీస్తున్నాయి. వామపక్ష పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా సమస్య పరిష్కరించాలని గిరిజన రైతులతో కలిసి జిల్లాలో ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం 2018 కటాఫ్‌ తేదీని నిర్ణయిస్తుందనే చర్చ కొనసాగుతుంది. పొరుగున ఉన్న ఆంధ్రా రాష్ట్రంలో 2018ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. 2014, 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని హావిూ ఇచ్చారు. దీనిపై కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, రెవెన్యూ, ఆర్డీవోల చేత సమగ్రంగా రికార్డులను కూడా పరిశీలింపజేస్తున్నారు. పోడు భూముల సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. గతంలో జిల్లాలో కొంత మందికి హక్కు పత్రాలను అందించారు. జిల్లాలో వందల కిలోవిూటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇంకా అనేకమంది గిరిజనులు హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.