వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదగాలి


కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా సాగాలి

గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి
యాదాద్రిభువనగిరి,అక్టోబర్‌27( జనం సాక్షి); వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. దళితబంధు పథకం అమలుతో వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ గ్రామ దళితులు ఆర్థికంగా విజయం సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని కొనియాడారు. గొప్ప గొప్ప కలలు కని వాటిని సాకారం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది అని పేర్కొన్నారు. రూపాయి కూడా వృధా చేయకుండా ఆర్ధికంగా బలోపేతం కావాలి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా వాసాలమర్రి దళితులు సమగ్రాభివృద్ధి సాధించాలి. మరోసారి వాసాలమర్రి దళితులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని గొంగిడి సునీత పేర్కొన్నారు.
..........................