సిఎం కెసిఆర్‌ పిలుపునకు విశేష స్పందన


యాదాద్రి స్వర్ణగోపురానికి భారీగా విరాళాలు

విరాళాలు ప్రకటించిన కడపకు చెందిన జడ్పీటిసి, జలవిహార్‌ ఎండి
హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. పలువురు తమవంతుగా బంగారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, చిన్న మండెం జడ్పీటీసీ మోడెం జయమ్మ.. కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. కేసీఆర్‌ పిలుపు మేరకు తాను.. తన కుటుంబ సభ్యులందరం కలిసి ఒక కిలో బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిదిలో అందజేస్తానని తెలిపారు. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించిన ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం జలవిహార్‌ ఎండీ రామరాజు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అశోకుడు చెట్ల పెంపకం, రాణి రుద్రమ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి, రాజ రాజ చోళుడు దేవాలయాల నిర్మాణానికి పాటుపడ్డారు. సంస్కృతిని కాపాడేందుకు కృష్ణ దేవరాయలు విశేషమైన కృషి చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హరితహారం, మిషన్‌ కాకతీయ, భగీరథతో పాటు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. మహా చండీ యాగం చేశారు. ఇవన్నీ ఒక దశాబ్ద కాలంలోపే పూర్తి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ శతాబ్దానికి ఒక సంస్కర్త, భగీరథుడు, చక్రవర్తి అని ఎండీ రామరాజు కొనియాడారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి దేవాలయానికి కేజీ బంగారం సమర్పిస్తున్నామని రామరాజు స్పష్టం చేశారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్‌ తొలుత తన వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన విషయం విదితమే.