తిరుమల,అక్టోబర్27 ( జనం సాక్షి); ఆంధ్రమహాభారతంలో తిక్కన ముప్పై రెండు రకాల నవ్వులను ఉదాహరించాడు. ఏ నవ్వయినా, ఎలాంటి నవ్వయినా మొదట చిరునవ్వుతోనే మొదలవుతుంది. చిరునవ్వుతో సంభాషించడం వ్యక్తిత్వ వికాసంలోని ఒక కళ. అందాన్ని ఇనుమడిరపజేసే ఆభరణం చిరునవ్వు అంటుంది సౌందర్య శాస్త్రం. నవ్వు రుగ్మతల్ని దూరం చేసి మరో ఏడేళ్ల ఆయుష్షును పెంచుతుందంటారు శాస్త్రవేత్తలు. నవ్వుతూ నిద్రలేచి నవ్వుతూ నిద్రకు ఉపక్రమించే వ్యక్తి కన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు. నిర్మల నిశ్చల తటాకంలాంటి మానసిక స్థితి కలిగిన వారికే అది సాధ్యం. కృతకంగా కనిపించే పొడి నవ్వుల కన్నా పెదాలపై జీవం పోసుకునే నవ్వులే మానవ సంబంధాలను గట్టిపరుస్తాయి. నవ్వు అసంకల్పితం కారాదు. కొన్ని చోట్ల నవ్వలేం. అసందర్భంగా ఉంటుంది. మనసు విప్పి మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి చోట్ల హృదయం సంపూర్ణ వికసిత పుష్పమవ్వాలి. నవ్వే ముఖం సర్వత్రా వెలుగు కిరణాలు పంచాలి. నవ్వే వ్యక్తి చుట్టూ స్వర్గం ఆవరించుకుని ఉంటుంది. ఇది సత్యం.
మందస్మితం ఆరోగ్య లక్షణం