కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాపై వేటు? ` అమిత్‌షాతో భేటి


దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి వెళ్లిన మిశ్రా.. దాదాపు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. లఖింపుర్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఘర్షణలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. లఖింపుర్‌ హింసాకాండ నేపథ్యంలో మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మిశ్రా.. అమిత్‌ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రా పోలీసులకు లొంగిపోయే యోచనలో ఉన్నట్లు జాతీయ విూడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వస్తున్న వార్తలను అజయ్‌ మిశ్రా ఖండిరచారు. ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. అంతేగాక, ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల విూదకు దూసుకెళ్లిందని వెల్లడిరచారు. ఆ తర్వాత రైతులు జరిపిన దాడిలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.