హుజూరాబాద్‌లోనూ విద్యుత్‌ సంక్షోభంపై ప్రచారం

 


అందివచ్చిన అవకాశంతో మంత్రి హరీష్‌ ఎదురుదాడి
బిజెపికి సంకటంగా మారిన విద్యుత్‌ విధానం
కరీంనగర్‌,అక్టోబర్‌11 ( జనం సాక్షి ), : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బిజెపి లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేస్తోంది. దేశంలో విద్యుత్‌ సంక్షభాన్ని కూడా తమ ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు తాజాగా ప్రస్తావిస్తు న్నారు. అంతటా సంక్షోభం ఉంటే మనదగ్గర మాత్రం కెసిఆర్‌ నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాడని అంటు న్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో కూడా నిరంతర విద్యుత్‌ పథఖం ప్రారంభించే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. ధరలు పెంచడం, ఉన్న కంపెనీలను మూయడం మాత్రమే బిజెపికి తెలుసని విమర్శలు గుప్పిస్తున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థి నామినేషన్‌తో పాటే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగారావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ కూడా ఐదు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నది. ఇకపోతే ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అన్ని గ్రామాలు చుట్టిరావాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారు. విద్యార్థి, యువజన విభాగాలు ఇప్పటికే ప్రచారానికి మండలాలవారీగా, పట్టణాల వారీగా సమన్వయకర్తలను నియమించాయి. రేవంత్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చిన తరవాత ..వీలైనన్ని గ్రామాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు. నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ 19 మంది పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఉన్నవారిని కాదని, పార్టీ అధిష్ఠానం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విద్యార్థి విభాగం నాయకుడికి పోటీచేసే అవకాశం కల్పించినందున తాము కూడా విద్యార్థి నాయకుడినే పోటీలో ఉంచాలని కాంగ్రెస్‌ భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 61వేల పై చిలుకు ఓట్లను తెచ్చుకున్న కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరిగా సాగుతున్న పోరును ముక్కోణ పోటీగా మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. మొత్తంగా ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి నియోజకవర్గంలో ఏమి జరుగుతున్నదనేది క్షణక్షణం తెలుసుకుంటున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో పోలీసు శాఖ నిఘా పెట్టింది. 1900 మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది. త్వరలో 120 సెక్షన్‌ల కేంద్ర బలగాలు రానున్నాయి. ఏదైనా చిన్న ఘటన జరిగినా, అనుమానం ఉన్నా డ్రోన్లు, బ్లూ కోల్ట్స్‌, పెట్రోకార్‌లతో పోలీసులు రేయింబవళ్లు పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు, వివిధ రకాల అక్రమ చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించేవారి ప్రతి కదలికలు నిక్షిప్తం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాలుగు డ్రోన్‌లతో నిత్యం పరిశీలిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు, నాకాబందీలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఇప్పటికే అరకోటి రూపాయలు నగదుతోపాటు భారీ ఎత్తున మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఎన్నికల సభలు, సమావేశాలకు అనుమతుల మేరకే ప్రజలు హాజరయ్యారా? లేక అధిక సంఖ్యలో ప్రజలను తరలించారా?
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారా? అనేది పరిశీలించేందుకు డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలను వినియోగించి అంచనా వేస్తున్నారు. ఏ వాహనం, వ్యక్తిపై అనుమానం ఉన్నా వెంటనే సవిూపంలోని చెక్‌పోస్టుకు సమాచారం అందించి తనిఖీ చేస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ ప్రతిరోజు రెండుసార్లు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందికి పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. ఉప ఎన్నికలపై నిఘా కోసం హుజురాబాద్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 406 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ న్యూస్‌, వదంతులు వ్యాప్తి చెందకుండా 24 గంటలు నిఘా పెట్టారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కోటి 27 లక్షల 34 వేల 610 రూపాయల నగదు పట్టుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంఘటనల్లో 33 కేసులను నమోదు చేశారు.