` చినజీయర్ స్వామి సూచనలతో 28న ముహూర్తం ఖరారు
` అంతకు ముందే 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహణ
` ప్రపంచ వ్యాప్తంగా పండితులకు ఆహ్వానం..యాగంలో పాల్గోనేలా సవిూకరణ
` యాదాద్రి వైభవంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విూడియాకు వివరణ
` యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం
` 125 కిలోల బంగారం పడుతుందని అంచనా
` స్వయంగా కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించిన సీఎం
` మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిలు 2కిలోల చొప్పున ప్రకటన
` ప్రతి గ్రామం నుంచి విరాళాలు సేకరణ
` ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయం
యాదాద్రి,అక్టోబరు 19(జనంసాక్షి):యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా కుంభ సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహాసుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. మహా సుదర్శన యాగంతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్లు చెప్పారు. ఆలయ పునర్నిర్మాణం జరిగినందున దీనిని ఆగమోక్తంగా నిర్వహిం చాల్సి ఉన్నందున త్రిదండి చినజీయర్ స్వామి ఆశిస్సులతో..వారి అనుగ్రహంతో వారు నిర్ణయించిన ముహూర్తం మేరకు మహాసుదర్వన యాగంతో ప్రారంభిస్తామని చెప్పారు. యాదాద్రిలో ఉదయం నుంచి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిఎం కెసిఆర్ మంత్రులతో కలసి విూడియాకు వివరాలు వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలంతో పాటు.. కొత్త సంవత్సరాది ఉగాది పండగను కూడా చూసుకుని జీయర్ స్వామి ముహూర్తం నిర్ణయించారని అన్నారు. ఇందులో భాగంగా వేయి ఎనిమిది కుండాలతో మహాసుదర్శన యాగం చేపడతామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణ అణచివేయబడిరదని తాను ఉద్యమ సందర్భంలో అనేక పర్యాయాలు చెప్పానని, ఇప్పుడు ఒక్కో రంగాన్ని అభివృద్ది చేసుకుంటూ వస్తున్నామని అన్నారు. గొప్ప ఆధ్యాత్మిక సంపద ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పుష్కరాలు కూడా నిర్వహించేవారు కాదన్నారు. ఉద్యమ సమయంలో ప్రశ్నిస్తే పుష్కరఘాట్లు నిర్మించారని గుర్తు చేశారు. జోగులాంబ దేవాలయం గొప్ప శక్తిపీఠమని తెలిపారు. కృష్ణా పుష్కరాలను జోగులాంబ గద్వాలలో ప్రారంభించామన్నారు. యాదాద్రి ఎప్పుడు ప్రారంభిస్తారని అందరూ అడుగుతున్నారని కేసీఆర్ తెలిపారు. మహా సుదర్శన యాగంతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. సమైక్య పాలకుల పరిపాలన అన్నిరంగాల్లో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ సామాజిక పరమైన నిర్లక్ష్యానికి పరమైన విషయాల్లో కూడా చాలా నిరాధరణ జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో పుష్కరాలు పుణ్య నదులైనటువంటి గోదావరి, కృష్ణ, ప్రాణహిత పుష్కరాలు గతంలో నిర్వహించే వారు కాదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభను ప్రపంచానికి తెలియజేశాం. స్వరాష్ట్రంలో గోదావరి తీరమంతా వందల సంఖ్యలో ఘాట్లు నిర్మాణం అయ్యాయి. ప్రాణహిత, కృష్ణా తీరాల్లోనూ నిర్మాణాలయ్యాయి. చాలా మహోజ్వలంగా తెలంగాణ పుష్కర శోభను యావత్ ప్రపంచానికి ప్రసరింపజేసింది. అద్భుతమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక సంపద, గొప్ప చరిత్రను కలిగి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఇక్కడ అన్ని రకాల, అన్ని శాఖల ఆధ్యాత్మిక పరిమణాలు అనేక చారిత్రక అవశేషాలను ఈ మధ్య నూతన చరిత్రకారులంతా వెలికి తీసి ప్రపంచానికి తెలిజేస్తున్న విషయం అందరి ముందే ఉంది. మహోత్కృష్టమైన పుణ్య క్షేత్రాల్లో తెలంగాణలో విశిష్టమైందని, ప్రముఖమైంది స్వయంభుగా వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. 50 ఏళ్ల కిత్రం బాల్యంలో కుటుంబ పెద్దలతో మెట్లమార్గంలో యాదాద్రికి వచ్చాను. ఆధ్యాత్మిక ఉపాసకులు నడయాడిన ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాల్లో జోగులాంబ ఘాట్‌ను నిర్మించాం. పురష్కరాల్లో నేను జోగులాంబ ఘాట్‌లోనే పుణ్యస్నానం ఆచరించాను. పుష్కరాల్లో మంత్రులే వలంటీర్లుగా పని చేశారు. లక్షలాది మంది భక్తులు మళ్లీ ఒకసారి తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రను పుష్కరాల రూపంలో సుసంపన్నం చేయడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తున్న క్రమంలో యాదాద్రి ఆలయాన్ని వైభవోతంగా తీర్చిదిద్దేందుకు యాదాద్రికి నాలుగేళ్ల కిందట బీజం వేశాం. మహోత్కృమైన ఆలయాల్లో ప్రముఖమైంది యాదాద్రి అన్నారు. కిషన్‌రావు ఆధ్వర్యంలో యాదాద్రి చాలా గొప్పగా క్షేత్రంగా ఆవిష్కృతమైంది’ అన్నారు. ఆగమ నియమ నిబంధనల మేరకు యాదాద్రి ఆలయ పునః నిర్మాణం ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రారంభంతో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం. చినజీయర్‌స్వామి సూచనలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చినజీయర్ సూచనలతో సిద్దాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునః నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ నిర్మాణం జరిగిందని వివరించారు.
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ నిర్మాణం పూర్తి కావడంతో తిరుమల తరహాలో స్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు 125 కిలోల మేలైన బంగారం అవసరమవుతుందని అంచనా వేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి గ్రామంలో నృసింహ పూజలు నిర్వహించి ప్రజలు తమకు తోచిన విధంగా ఇచ్చిన దానిని సవిూకరిస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ద్వారానే కొనుగోలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే క్రమంలో స్వర్ణగోపురం కోసం స్వయంగా సిఎం కెసిఆర్ తమ కుటంబం తరపున కిలో నూటపదహారు తులాల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి కూడా అంతే మొత్తంగా విరాళంగా ప్రకటించారు. అలాగే అక్కడే ఉన్న నగార్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే యాదాద్రి దేవాలయం ఆవరణలో నిర్మిస్తున్న టెంపుల్ సిటీలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న కాటేజ్ నిర్మాణానికి కూడా విరాళం ప్రకటించారు. ఈ కాటేజ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఈ ప్రకటనపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. యాదాద్రి పునఃప్రారంభం కేసీఆర్ దైవ సంకల్పానికి గొప్ప నిదర్శనమని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకు గొప్ప మహిమాన్వితమైన, పర్యాటక ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లే విధంగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇలాంటి గొప్ప దైవ సంకల్పం చారిత్రాత్మకం కావాలనే ఉద్దేశ్యంతోపునఃప్రతిష్టకు బంగారాన్ని కైంకర్యం చేస్తునట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కల్సి స్వర్ణ గోపుర తాపడానికి కిలో బంగారం అందజేస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఈ గొప్ప పుణ్యకార్యక్రమానికి భాగస్వామ్యం కావడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆ స్వామి వారి అనుగ్రహం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
ఆలయం రూపుదిద్దుకున్న తీరుపై సిఎం కెసిఆర్ సంతృప్తి
అంతకుముందు పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని కెసిఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పరిసరాలను కెసిఆర్ పరిశీలించారు. తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సీఎం కెసిఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలశ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో కెసిఆర్ కు స్వాగతం పలికారు. బాలాలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కెసిఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సిఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సిఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. సునీతా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడంతో సునీత జన్మ ధన్యమైందని కెసిఆర్ పేర్కొన్నారు. అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంఖు, చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను కెసిఆర్ పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్ర పటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని కెసిఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై కెసిఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా కెసిఆర్ పరిశీలించారు. ఇదే సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నామని, ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని కెసిఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సవిూపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని, ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సిఎం కెసిఆర్ మాట్లాడారు. యాదాద్రిలో పదివేలమంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని కెసిఆర్ వివరించారు. పీఆర్సీపై ఆలయ ఉద్యోగులను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు.
వచ్చే మార్చిలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ