పరస్పర విమర్శలతో వేడెక్కుతునన ఎపి రాజకీయం

 


వైసిపిపై ఎదురుదాడితో టిడిపి ముందస్తు ప్రచారం
ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్న పార్టీలు
సంక్షేమ పథకాలతో తమకు ఢోకాలేదన్న రీతిలో సిఎం జగన్‌
అమరావతి,అక్టోబర్‌9 (జనంసాక్షి):  ఎపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోఎన్నికలకు మరో రెండున్నరేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ విపక్ష టిడిపి ఎదురుదాడిని తీవ్రం చేసింది. డ్రగ్స్‌ వ్యవహారంతో మళ్లీ అధికార వైసిపికి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. విద్యుత్‌ ఛార్జీలపైనా పోరాడుతోంది. ఇలా అధికార వైసిపి, టిడిపిలు పరస్పర విమర్శలతో ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారాన్ని టిడిపి చేస్తోంది. రెండున్న రేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపు నిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం ఏర్పడిరదని కూడా అన్నారు. గత ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడానికి తనదైన వ్యూహాలతో సహకరించిన ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చే ఏడాది మార్చి తర్వాత మళ్లీ రంగంలోకి దిగుతారని జగన్‌ మంత్రులకు తెలియజేశారు. మరోవైపు ఆయనపై
నమోదైన ఈడీ కేసులలో విచారణ వచ్చే ఏడాది పూర్తయి తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నారని అధికార పార్టీ నాయకులు సైతం అభిప్రాయ పడుతు న్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అందుకు తగిన ప్రాతిపదిక ఏదీ లేదు. ఇదంతా విపక్ష టిడిపి ఆడుతున్న గేమ్‌ ప్లాన్‌ తప్ప మరోటి కాదు. ప్రస్తుతానికి మధ్యతరగతి ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్న విషయాన్ని అధికారపార్టీ వారు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అనేక కార్యక్రమాల పేరుతో డబ్బులను యధేచ్ఛగా పందేరం చేస్తున్నారు. అనేక నిర్ణయాలను వెనకాముందు చూడకుండా తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనకు అడ్డేముంటుందని భావిస్తున్నారు. ఫలితంగా న్యాయస్థానంతో పదేపదే చివాట్లు తింటున్నారు. ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలను కూడా ఇష్టానుసారం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కూడా పరిమితులు ఉంటాయంటే సిఎం జగన్‌ అంగీకరించినట్లు లేదు. రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదని భావించడం వల్లనే జగన్‌రెడ్డి ఇప్పుడు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన పాలనలో చీకటి దందాలపై కథకథలుగా చెప్పుకుంటున్నారు. జగన్‌ తీరు వల్లే ఆయన ప్రభుత్వంపై రెండేళ్లకే వ్యతిరేకత నెలకొంది. గత ఎన్నికల్లో ఆయనను గుడ్డిగా సమర్థించిన వారు సైతం ఇప్పుడు జగన్‌ పాలనపై పెదవి విరుస్తున్నారు. అధికార పార్టీలో అసహనం పెరిగిపోతోంది. మంత్రి కొడాలి నానితో పాటు జోగి రమేష్‌ చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జోగి రమేష్‌ వంటి వారు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోలీసులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని భావించి ఎవరిపైన అయినా దాడి చేస్తామన్న రీతిలో రాజకీయాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడం లేదని, తాలిబన్ల పాలనే సాగుతోందని టిడిపి ఎదురుదాడి చేస్తోంది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించడం అవసరం. అప్పులు చేసి ప్రజలకు పంచిపెడుతున్నందున తమకు తిరుగులేదని జగన్‌ భావిస్తున్నారు. ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం ఇదే భావనలో ఉన్నట్లు ఉన్నారు. న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు తప్పు చేశామని అంగీకరించడం లేదు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులలో న్యాయస్థానాలు ఈ మధ్య మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో పాలకులు జాగ్రత్తగా ఉండకుంటే కోర్టులు కూడ ఆజోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు.