హుజూరాబాద్‌లో ఊపందుకున్న ఉప ఎన్నిక వేడి


పథకాల వెల్లువలో తడిసి ముద్దవుతున్న ప్రజలు

ఇంటింటికీ పథకంలా దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌
అధికార పార్టీ దూకుడు ముందు బిజెపి వెలవెల
ఈటెల ఛరిష్మాతో గట్టెక్కాలనుకున్న బిజెపి ఎదురీత
హుజూరాబాద్‌,అక్టోబర్‌2  (జనం సాక్షి) : హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడితో పాటు పథకాల వెల్లువలో వచ్చిపడుతున్న డబ్బులతో ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. దళితులకు పదిలక్షల సాయం
అందుతోంది. మహిళలకు పథకాలు చేరుతున్నాయి. కులాల వారీగా దావత్‌లు ఇస్తున్నారు. రోజూ దసరా పడంగలా సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. కోళ్లు తెగి పడుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ నేతలు అక్కడే మకాం వేసి మగపెళ్లివారిలా ప్రజలను చూసుకుంటున్నారు. వారికి ఏం కావాలో అన్నది గ్రహించి చేసిపెడుతున్నారు. గ్రామాల వారీగా విభజించుకుని ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇప్పుడు పరిస్థితి టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారిందనే చెప్పాలి. దీనికితోడు చాలామంది ఈటెల రాజేందర్‌ ఇంకామంత్రి అనుకునే వారు ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రచారం కూడా టిఆర్‌ఎస్‌..కారుగుర్తుకే అనుకునే వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నిజానికి బిజెపి ఉనికే లేదు. ఈటెల రాజేందర్‌తో వచ్చిన బలం తప్ప బిజెపికి ఉన్న బలం సున్నా అనే చెప్పాలి. అయితే ఈటెల రాజేందర్‌ రాజీనామా.. బిజెపిలో చేరికతో హుజూరాబాద్‌ ఉపఎన్నిక బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ తదనుగుణ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దీనికి అనగుణంగా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి హుజ్నాబాద్ల్‌ఓ ముగింపు పలికారు. ఇరవై ఏళ్లకు పైగా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతగా, కేసీఆర్‌ ఉద్యమ సహచరుడిగా కొనసాగి, ఆరు పర్యాయాలు ఎదురులేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ఉన్న ప్రతిష్ట తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అయితే రాజీనామా చేసిన తొలినాళ్లలో ఈటెలకున్న ఆదరణ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. టిఆర్‌ఎస్‌ ప్రచారం ముందు,పథకాల ముందు ఆయన తెల్లబోతున్నారు. ప్రజలు కూడా పథకాలకు జై కొడుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల వెంట.. ఆ పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది బీజేపీలోకి వస్తారని అనుకున్నారు. కానీ హరీష్‌ రావు వేసిన ఎత్తులకు వారంతా టిఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. దీంతో ఈటెల ఒంటరిగానే కాషాయ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. పార్టీ కార్యకర్తలతోనే బూత్‌స్థాయి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు నానాయాతన పడుతున్నారు. హుజూరాబాద్‌ ప్రజల్లో ఈటలకున్న మంచిపేరును వినియోగించుకుని అధికార టీఆర్‌ఎస్‌ª`ను గెలవవచ్చని బిజెపి వ్యూహాలను పన్నుతోంది. వ్యూహాత్మకంగా అన్నిస్థాయిల్లో పార్టీ ఇన్‌చార్జీలను నియమించుకుని ముందుకు సాగుతోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధానపోటీదారుగా నిలిచి గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ తర్వాత నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బిజెపి చతికిల పడిరది. ఈ పరిస్థితిని అధిగమించి ఇప్పుడు హుజూరాబాద్‌ను చేజిక్కించుకుంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లొచ్చన్నది బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు,కెసిఆర్‌ కుటుంబ పాలన వంటి అంశాలపైనే బాగా ఫోకస్‌ చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాతే దళిత బంధు స్కీం ప్రకటించడం, హుజూరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో అధికార పార్టీ ఎత్తుగడలకు బిజెపి చిత్తవుతోంది. దళితబంధు ద్వారా హుజూరాబాద్‌ లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు డిపాజిట్‌ చేయడంతో బిజెపికి దిక్కుతోచడం లేదు. అయితే మిగతా కులాల్లో ఉన్న వ్యతిరేకత వల్ల హుజూరాబాద్‌లో తమకు కలసి వస్తుందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే గ్రామగ్రామాన టిఆర్‌ఎస్‌ దూకుడు ప్రచారంతో బిజెపికి స్టార్‌ కాంపెయినర్లు లేకుండా పోయారు.
వివిధ మండలాలు, గ్రామాలుగా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. దసరా తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సవిూపించే కొద్దీ వేడిపెంచి ప్రచారాన్ని ఉధృతం చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనెల 15 తర్వాత రాష్ట్రపార్టీ నాయకత్వం మొదలు, అన్ని స్థాయిల్లోని నాయకులు పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ప్రత్యక్షంగా ఆయా అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పోటీపడుతుండగా, కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే టిఆర్‌ఎస్‌కున్న ఆర్థిక అంబబలం ముందు అన్ని పార్టీలు పేలవ ప్రదర్శన కానున్నాయి.