వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు


మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమల,అక్టోబర్‌11(  జనంసాక్షి): తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదోరోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న స్వామివారిని, శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. కార్యక్రమంలో పెద జీయర్‌స్వామి, చినజీయర్‌ స్వామి, టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, సనత్‌ కుమార్‌, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్ప స్వామివారు కటాక్షించనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.