దుబాయ్‌లో మెదక్‌ జిల్లా వాసి మృతి

డెడ్‌బాడీని తెప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

మెదక్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. హవేలి ఘనపూర్‌ మండలం జక్కన్న పేట్‌ గ్రామానికి చెందిన మోహన్‌ దుబాయ్‌లో పనిచేస్తే గుండెపోటుతో సోమవారం మరణించాడు. రెండేళ్ల క్రితం సొంతూరు వచ్చి కుటుంబంతో కొన్నాళ్లు సంతోషంగా గడిపి మళ్లీ దుబాయ్‌ వెళ్లిపోయాడు. అలా వెళ్లిన మోహన్‌ గుండెపోటుతో సోమవారం మృతి చెందినట్లు అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్‌కు భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త చనిపోయిన విషయం తెలిసి సరిత రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మోహన్‌ మృతదేహాన్ని సొంతూరు తీసుకురావడానికి కృషి చేయచాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌ రెడ్డిని ఆ గ్రామస్తులంతా కలిసి దుబాయ్‌ నుంచి మోహన్‌ మృతదేహాన్ని సొంతూరు తరలించేలా చూడాలని విన్నవించుకున్నారు. మోహన్‌ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం కోరుతానని ఎమ్మెల్యే వారికి హావిూ ఇచ్చారు.