అలయ్‌ బలయ్‌లో పలువురి సన్మానం


హైదరాబాద్‌,అక్టోబరు 17(జనంసాక్షి): నగరంలోని జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం సందడిగా జరుగుతోంది. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో భాగంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు పూజలు చేశారు. ఇందులో దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్‌ బలయ్‌ను జరుపుతున్నారు. ప్రముఖులు హాజరైన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖులకు సన్మానం..
జలవిహార్‌లో నిర్వహిస్తోన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సన్మానించారు. భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ అధినేత ప్రసాద్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్‌`ఇ ఎండీ మహిమ దాట్ల, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.