గెలుపు కోసం వ్రమించాల్సిందే !

 


తిరుమల,అక్టోబర్‌22(జనంసాక్షి ): ఓడిపోవడానికి కాదు కదా మనం పుట్టింది. గెలుపు కోసం జన్మించాం. గెలుపును వరించడానకే శ్రమించాలి. సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగితే అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప బలం సిద్ధిస్తాయి. మన జీవితం సజావుగా సాగాలంటే దైన్యాన్ని అజ్ఞానాన్ని దుఃఖాన్ని వదులుకోవాలి. జీవన మార్గంలో కంటకాలు ఉంటాయని గ్రహించాలి. బాధ్యతలు పైన పడ్డాక జీవిత పయనం అంత సులువైంది కాదని అనుభవాలు చెబుతాయి. అందుకు సిద్ధమై ముందుకు సాగాలి. అప్పుడు దైన్యం మన దరి చేరదు. కూతురి పెళ్ళి చేయాలి, ఎలాగని కుంగిపోకూడదు. ముళ్లు పక్కకు తొలగించుకుంటూ నడిస్తే ఎక్కడో ఒకచోట మెత్తని పచ్చిక కనపడుతుంది. మన సాధారణత్వం తొలగి అసాధారణ శక్తి ఆవహిస్తుంది. నలుగురూ సహాయ హస్తం అందిస్తారు. కూతురి పెళ్ళి అలా... జరిగిపోతుంది. మనలోని సంకల్ప బలం, పట్టుదల ఆ ఆపన్న హస్తాలకు అర్హత సంపాదించి పెడతాయి. అందుకు మనకు కావాల్సిందల్లా నింపాదిగా ఉంటూ ..మనో దైర్యంతో ముందుకు సాగే అలవాటు చేసుకోవడం. చెప్పడం ఎంత సులువో అర్థం చేసుకుని అలవాటు చేసుకుంటే కూడా అంతే సులువని గుర్తించాలి. మన పురాణాలు, మహనీయుల జీవితాలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి.