కొత్తపేట నుంచి తరలనున్న పండ్ల మార్కెట్‌


కోహెడలో అత్యాధునిక మార్కెట్‌ నిర్మిస్తామన్న మంత్రిమంత్రులతో కలసి స్థలాలను పరిశీలించిన నిరంజన్‌ రెడ్డి

 హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) : ప్రస్తుతం ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ను తరలించి  హయత్‌ మండల పరిధిలోని కోహెడలో 178 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్నట్టు వ్యవసాయ,మార్కెంటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ తరలింపు నేపథ్యంలో తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటు కోసం కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. సోమవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు బలాలా, జాఫర్‌ హుస్సేన్‌, సుధీర్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్‌ లక్ష్మణుడు తదితరులతో కలిసి మంత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక మార్కెట్‌ నిర్మాణం చేపడతామని, దసరా నాడు వర్తకులకు కేటాయించిన స్థలానికి లే ఔట్‌ నిర్దారణ చేస్తామన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థానంలో నూతన అత్యున్నత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల విూదుగా శంకుస్థాపన జరగనుందని తెలిపారు. తాత్కాలికంగా బాటసింగారంలోని 11 ఎకరాలలో పండ్ల మార్కెట్‌ ను ఏర్పాటుచేసి దసరా నుండి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. పార్కింగ్‌, రహదారులతో పాటు కోల్డ్‌ స్టోరేజి వంటి వసతులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కోహెడ మార్కెట్‌ కు వెళ్లే వరకు బాటసింగారంలో వసతుల లేమి లేకుండా చూడాలని వ్యాపారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అవుటర్‌ కు చేరువలో, అహ్లాదకక వాతావరణంలో ఈ ప్రాంతం వుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.శాసనసభలో ఎంఐఎం విజ్ఞప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు విక్టోరియా హోం (వీఎంహోం) ను పండ్ల మార్కెట్‌ నిర్వహణకు పరిశీలించామని, కానీ స్థలం సరిపోదని అన్నారు.బాటసింగారంలో తాత్కాలికంగా కొనసాగింపుకు ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం సమ్మతించినట్టు చెప్పారు.