చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సత్ఫలితాలు
రెండోదశ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి: ఆలహైదరాబాద్,అక్టోబర్8 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాగుల విూద చెక్ డ్యామ్ లు నిర్మించాలనేది చాలా గొప్ప ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చెప్పినట్లుగానే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా కోయిల్ సాగర్ నుంచి రామన్ పాడ్ వరకు, నిజాలపూర్ నుంచి సరళా సాగర్ వరకు రెండు పెద్ద వాగుల విూద తొలిదశలో చెక్ డ్యామ్ లు నిర్మించినామన్నారు. ఆ చెక్ డ్యామ్‌లు పూర్తి అయి ఒక్కో చెక్ డ్యామ్ దగ్గర దాదాపు 2 కిలోవిూటర్ల మేర నీళ్లు ఆగి.. భూగర్భ జలాలు భారీగా పెరిగాయని ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని చోట్ల చెక్ డ్యామ్ లు అవసరం ఉన్నాయన్నారు. రెండో దశలో భాగంగా ఇంకా నిర్మించాల్సిన చెక్ డ్యాంల కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. రెండో దశ కింద చెక్ డ్యామ్ లు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి ఆలోచన ద్వారా ఇప్పుడు గోదావరి 130 కిలోవిూటర్లు సజీవంగా ఎలా వుందో మా రెండు వాగులు కూడా సజీవంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరిన చెక్ డ్యామ్ ల అంశాన్ని నోట్ చేసుకున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మిగిలి పోయిన చెక్ డ్యామ్ లను మంజూరు చేస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.