మార్కెట్‌కు భారీగా తరలివస్తోన్న పత్తి

 తేమశాతంపై ఇంకా తొలగని ప్రతిష్ఠంభన

పత్తి రవాణా విషయంలోనూ పేచీ
ఆదిలాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ): జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే
పత్తి భారీగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజునే ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో ప్రతిష్టంభన నెలకొంది. ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లను కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మార్కెట్‌ కమిటీ జేడీ మల్లేషంతో కలిసి వేలంపాట నిర్వహించారు. మద్దతు, తేమ విషయంలో రైతులు, వ్యాపారస్థుల మధ్య సందిగ్ధం నెలకొంది. ప్రైవేట్‌ మ ద్దతు ధర రూ.7411 నుంచి ప్రారంభంకాగా 8 నుంచి 12 శాతం మైచర్‌ వరకు ధర గిట్టుబాటు కాదని రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో కలెక్టర్‌ జిన్నింగ్‌ వ్యాపారస్థులు రైతులకు ధరలు పెంచాలని కోరగా చివరకు రూ.7970కి నిర్ణయించారు. తేమశాతం 8 నుంచి 12 శాతం నష్టపోతామని రైతులు అన్నారు. ఎంతకు తేమశాతం తేలకపోవడంతో మధ్యా హ్నం 3 గంటల వరకు కొనుగోళ్ల ప్రారంభానికి ఎదురు చూడాల్సి వచ్చింది. అనంతరం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో కొంత మంది రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తిని తూకం వేయగా ఇంకొంత మంది రైతులు తేమ శాతం 8 నుంచి 12 వరకు కాకుండా 20 వరకు ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. సుమారు 2 గంటల పాటు కిసాన్‌చౌక్‌లో ఆందో ళన చేపట్టారు. ఇప్పటికే పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లను ప్రారంభించక పోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పలేదు. పంటను నిల్వ చేసుకునే అవకాశం లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యం కావడంతో నిత్యం పంట నిల్వల వద్ద కాపల కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ యేడు జిల్లాలో 4లక్షల 34వేల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. అధిక వర్షాలతో పంట దిగుబడులు కొంత మెరకు తగ్గినా సుమారుగా 25లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 27 జిన్నింగ్‌ ఫ్యాక్టరీలు ఉండగా ఈ సారి మాత్రం 14 జిన్నింగ్‌లు మాత్రమే పత్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఈ యేడు లారీ ఓనర్‌ అసోసియేషన్‌ రవాణా చార్జీల విషయంలో కొత్త విధానాన్ని తెరపైకి తేవడాన్ని ట్రేడర్స్‌ తీవ్రంగా విభేదిస్తున్నారు. గుంటూరు, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ముంబాయి, కృష్ణపట్నం లాంటి ప్రాంతాలకు పత్తి ఘటన్స్‌ను తరించాల్సి ఉంటుంది. దీంతో రవాణా భారం పెరిగి పోతుందని లారీ అసోసియేషన్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. రవాణా చార్జీలు పెంచితేనే ఘటన్స్‌ తరలిస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వాదిస్తున్నారు. గతంలో ఏపీలోని గుంటూరుకు రవాణా చార్జీగా రూ.35వేలను చెల్లించగా ఈ సారి మాత్రం ఏకంగా రూ.43వేల వరకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇరువర్గాలు మార్కెటింగ్‌ అధికారులకు సహకరించాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు.