హైదరాబాద్,నవంబర్22(జనం సాక్షి): రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందడంలేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రజలకు అందించాలని ధర్మాసనం సూచించింది. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేలా ప్రచారాలు చేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే గ్రేటర్ వ్యాప్తంగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పక్రియ సోమవారం నుంచి ప్రారంభిస్తునట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 4,846 కాలనీలలో గతంలో మొదటి డోస్ పూర్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాలనీల్లో, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో, బస్తీ దవాఖానాల్లో రెండో డోస్ వ్యాక్సిన్ వేయనున్నారు. డ్రైవ్‌లో భాగంగా ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి జాబితాను గుర్తించి మరుసటి రోజు వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ వేస్తారు.