1.కేంద్రంపై పోరు కొనసాగుతుంది
` దశవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు
` ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్యే ఉండండి
` రైతుబంధు ఆపబోం:సీఎం కేసీఆర్‌
` 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపు
హైదరాబాద్‌,డిసెంబరు 17(జనంసాక్షి): రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడిరచారు. కష్టపడి పనిచేయాలని.. నిరంతరం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దహనం చేయాలన్నారుసమావేశం ముగిసిన అనంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ భేటీలో చర్చించిన అంశాలను వివరించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతులు బాధపడుతున్నారు. పార్లమెంట్‌లోనూ తెరాస సభ్యులు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తెరాస ఎంపీలు ఉభయసభల్లో ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఈసారి వానాకాలం ధాన్యం కొనుగోలు కోటాను భారీగా తగ్గించింది. ధాన్యం సేకరణపై కేంద్రం ఇచ్చిన లక్ష్యం ఇప్పటికే పూర్తి చేశాం. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉంది. ఇంకా సగం పంట కల్లాలు, పొలాల్లోనే ఉంది. మిగిలిపోయిన ధాన్యాన్ని ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని భావిస్తున్నాం. రా రైస్‌ ఎంతైనా కొంటామని హావిూ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు కొనట్లేదు?కేంద్ర ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం. గోదాములు, వ్యాగన్లు ఖాళీ లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యం తరలించట్లేదు. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. తెరాస ఎంపీలతో కలిసి ఆరుగురు మంత్రుల బృందం రేపు దిల్లీకి వెళ్లాలని నిర్ణయించాం’’ అని మంత్రి వివరించారు.

 

2.దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌
` 101కి చేరిన కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య
` 11 రాష్టాల్ల్రో తీవ్రంగా ఉందన్న కేంద్ర వైద్యారోగ్య శాఖ
` అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
న్యూఢల్లీి,డిసెంబరు 17(జనంసాక్షి):కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 101కి చేరిందని వైద్య శాఖ వెల్లడిరచింది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ 11 రాష్టాల్రకు విస్తరించగా మొత్తంగా 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 101 ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. మొత్తం 11 రాష్టాల్ల్రో ఆ కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడిరచారు. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢల్లీిలో 20 కేసులు బయటపడినట్లు తెలిపింది. రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా వేరియంట్‌తో సంబంధం లేకుండా కేసులు పెరగడంతో 19 జిల్లాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయని, దీంతో అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే 2.4 శాతం వాటా కలిగి ఉందని హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో పాటు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేపట్టవద్దని, సమావేశాలు, పెద్ద సమూహాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్‌ చేసుకోవాలని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బల్‌రామ్‌ భార్గవ తెలిపారు. యూరోప్‌లో భారీ స్థాయిలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతు న్నాయని, అక్కడ మహమ్మారి కొత్త దశ నడుస్తోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పౌల్‌ తెలిపారు. ప్రతి శ్యాంపిల్‌కు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సాధ్యం కాదు అని డాక్టర్‌ పౌల్‌ చెప్పారు. అయితే వ్యూహాత్మక రీతిలో శ్యాంపిళ్లను పరిశీలిస్తున్నామని అన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను 91 దేశాల్లో గుర్తించినట్లు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పిందన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో డెల్టాను ఒమిక్రాన్‌ దాటి వేస్తుందని ఆయన తెలిపారు. ఇకపోతే దేశ రాజధాని ఢల్లీిలో కొత్తగా మరో 10 కోవిడ్‌ వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఢల్లీిలో 20కి చేరుకోగా, వీరిలో పది మంది డిశ్చార్చ్‌ అయ్యారు. ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన పేషెంట్లు ఎవరెవరిని కాంట్రాక్ట్‌ చేశారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు ఢల్లీి ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. ఈనెల 5న తొలి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ కేసును ఢల్లీిలో గుర్తించారు. సోమవారం అతన్ని డిశ్చార్చ్‌ చేశారు. ఈనెల 2న అతను టాంజానియా నుంచి దోహాకు, అక్కడి నుంచి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో అతను ఢల్లీికి వచ్చినట్టు గుర్తించారు. అతను సౌత్‌ ఆఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో వారం రోజులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒమైక్రాన్‌ వైరస్‌ సోకిన అనుమానంతో ప్రస్తుతం లోక్‌నాయక్‌ ఆసుపత్రిలో 40 మందికి చికిత్స అందిస్తున్నట్టు మెడికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఒకపోతే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరసగా రెండో రోజు 8వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 7447 మంది కరోనా వైరస్‌ బారినపడినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,47,26,049లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్‌ వలన 4,76,869 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,16,011 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు తెలిపింది. కొవిడ్‌ కారణంగా. 7,948 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్‌గా ఉండగా గురువారం రాత్రి వరకు దేశ వ్యాప్తంగా 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

 

3.రాహుల్‌ భవిష్యత్‌ పధాని
` ప్రశాంత్‌ కిషోర్‌
న్యూఢల్లీి,డిసెంబరు 17(జనంసాక్షి):కాంగ్రెస్‌లో రాహుల్‌ ఎదుగుదల అసాధ్యమంటూ..ఆయన ప్రధాని పదవి చేపట్టలేరంటూ విమర్శలు గుప్పించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్‌ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే.. తాజాగా మాటమార్చారు. రాహుల్‌ నాయకత్వం సరిగా లేదని.. ప్రధాని ఎప్పటికీ కాలేరంటూ పేర్కొన్న ప్రశాంత్‌ కిశోర్‌.. తాజాగా మరోసారి స్వరాన్ని సవరించుకున్నారు. రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ తన నాలుకను మార్చారు. ఈ మేరకు తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లేకుండా కేంద్రంలో ఓ విపక్ష కూటమి ఏర్పాటు చేయడం.. మనగలగడం దాదాపు అసాధ్యమని తేల్చి చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్‌ లేకున్నా.. కేంద్రంలో విపక్ష కూటమి సాధ్యమేనంటూ పీకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ లేకుండా బలమైన ప్రతిపక్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే కేవలం పార్టీలను కూడగట్టుకోవడం ద్వారా బీజేపీని గెలుపును నియంత్రించలేమని పేర్కొన్నారు. మోదీని ఓడిరచేందుకు గట్టి సందేశం, నాయకత్వం కావాలని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అంతే కాకుండా హిందుత్వ అంశం అనవసరమని.. రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ప్రకటన వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందన్నారు. ఇకపోతే బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, జేడీయూతో తెగదెంపులు చేసుకున్న పికె తాజాగా ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో పనిచేసే అవకాశం కూడా లేదన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కూడా కాంగ్రెస్‌ మనుగడ సాధిస్తుందంటూ పీకే పేర్కొన్నారు. 2017 కంటే.. యూపీలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ నాయకుడు ఎవరని ప్రశ్నించగా.. పీకే సమాధానం చెప్పలేకపోయారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కాగలరంటూ ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కాంగ్రెస్‌ పూర్తిగా దూరం పెట్టడంతో ఆయన మాట మార్చినట్లు అర్తం అవుతోంది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటుందా అన్నది చూడాలి.

 

4.ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోండి
` యూకే,ఫ్రాన్స్‌ల విజృంభిస్తే రోజుకు 14 లక్షలు కేసులు వచ్చే ప్రమాదం
` నిపుణుల హెచ్చరిక
దిల్లీ,డిసెంబరు 17(జనంసాక్షి): ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది. డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో కూడిన ఈ కొత్త వేరియంట్‌ కేసులు మన దేశంలో 101 నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒమిక్రాన్‌, కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే.. అలాంటి పరిస్థితులు గనక భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్‌ హెచ్చరించారు. యూకే మాదిరి పరిస్థితి భారత్‌లో గనక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే, ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోజుకు 65వేల చొప్పున వస్తుండగా.. అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో ప్రతిరోజూ 13లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్‌లో 80శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్‌ పూర్తయినప్పటికీ డెల్టా ఉద్ధృతి తగ్గడంలేదన్నారు.అందువల్ల ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్‌ కేసులే వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్‌ కేసులు భారీగా నమోదవుతుండటంతో మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్‌ గుర్తు చేశారు.

5.వారణాసిని తీర్చిదిద్దాం
` దేశంలో అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలు
` మేయర్ల సదస్సులో వర్చువల్‌గా సందేశం ఇచ్చిన ప్రధాని మోడీ
న్యూఢల్లీి,డిసెంబరు 17(జనంసాక్షి):వారణాసిలో జరుగుతున్న అభివృద్ధి యావత్తు దేశానికి మార్గసూచి కాగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశంలోని అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలని చెప్పారు. ఇవి సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందాయన్నారు. స్థానిక నైపుణ్యాలు, ఉత్పత్తులు ఏవిధంగా ఓ నగరానికి గుర్తింపుగా మారగలవో ఇటువంటి ప్రదేశాలను చూసి తెలుసుకోవచ్చునని చెప్పారు. వారణాసిలో జరిగిన అఖిల భారత మేయర్ల సమావేశంలో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడారు. దాదాపు 120 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. నగరాల అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మేయర్లు తమ నగరం అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తు మెరుగుపడటానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని తెలిపారు. మన దేశానికి నేడు విప్లవం అక్కర్లేదని, క్రమవికాసాన్ని, పరిణామాన్ని మనం విశ్వసించాలని చెప్పారు. మన వారసత్వ కట్టడాలను కూల్చేసి, పునర్నిర్మించవలసిన అవసరం లేదని, వాటికి కొత్త శక్తిని అందించి, పునరుజ్జీవింప జేయాలని తెలిపారు. అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తమ నగరాలను అగ్ర స్థానంలో నిలిపేందుకు మేయర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ద్యాన్ని వార్షిక కార్యక్రమంగా పరిగణించకూడదన్నారు. వార్డుల్లో ప్రతి నెలా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందేమో చూడాలని కోరారు. అత్యంత సుందరమైన వార్డును ఎంపిక చేయడం కోసం పోటీ పడాలని చెప్పారు. నవ పట్టణ భారతం పేరుతో ఈ మేయర్ల సదస్సు జరిగింది.వారణాసి నుంచి ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన కాశీవిశ్వనాధ్‌ ధామ్‌ను ప్రారంభించారు. త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనుండటంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి.

6.ఇంటర్‌ ఫేలైనవారికి ఏప్రిల్‌ మారోమారు పరీక్షలు
` అనుమానాలున్న వారు జవాబుపత్రం పొందవచ్చు
` పరీక్షల్లో 70శాతం సిలబస్‌ తగ్గించి,ఛాయిస్‌ కూడా పెంచాం
` ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌
హైదరాబాద్‌,డిసెంబరు 17(జనంసాక్షి): తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఏప్రిల్‌ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్‌ 70శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచామని పేర్కొన్నారు.ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్‌ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు గురువారం వెల్లడిరచింది. మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌... రెండిరటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.
ఫెయిల్‌ అయిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిరది. కమలాపూర్‌ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిది. దీంతో మనస్తాపంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పాఠశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విద్యార్థినిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

 

7.డబుల్‌ ఇళ్లకు లంచాలు ఇవ్వొద్దు
` ప్రలోభాలుపెట్టే వారిని నమ్మొద్దు
` పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు
` దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం
` సికింద్రాబాద్‌లో డబుల్‌ ఇళ్ల కాలనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,డిసెంబరు 17(జనంసాక్షి): లంచాలు తీసుకుని డబుల్‌ ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని చెప్పారు. రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభించామని వెల్లడిరచారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్‌ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్‌, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. భారత దేశంలో నిర్మించిన మొత్తం ఇండ్లు ఒకెత్తు అయితే.. మన రాష్ట్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మరో ఎత్తు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లాంటి పథకం 28 రాష్టాల్ల్రో ఎక్కడా లేదన్నారు. రూ. 1800 కోట్ల రూపాయలతో డబల్‌ బెడ్‌ రూం ఇండ్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఇల్లు రూ. 45 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు. భారత దేశంలోని 28 రాష్టాల్లో ఇల్లు కోసం ఎంత ఖర్చు చేశారో.. తెలంగాణలో డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం అంత కంటే ఎక్కువ ఖర్చు చేశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన అన్నా రు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఇక్కడ ఇల్లు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు దొరకని వారికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామన్నారు కేటీఆర్‌. ఇండ్ల కేటాయింపులన్నీ లాటరీ పద్దతిలోనే ఇస్తామన్నారు. డబ్బులు ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తి ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తో పాటు మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు.

 

8.ఉద్యమకారులకు పదవులు
` మరో ఐదు కార్పోరేషన్లకు కొత్త చైర్మన్లు
` నియమించిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,డిసెంబరు 17(జనంసాక్షి):రాష్ట్రంలో మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్‌ నియమించారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల నగేష్‌, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గా పాటివిూది జగన్‌ మోహన్‌ రావు, తెలంగాణ సాహిత్య అకాడవిూ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.

 

 

10.అనుమతుల్లేకుండా ‘రాయలసీమ ఎత్తిపోతల’ వద్దు
` ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్జీటీ
దిల్లీ,డిసెంబరు 17(జనంసాక్షి): అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ 4నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.