హైదరాబాద్,డిసెంబర్7 (జనంసాక్షి) : అలా నదీ తీరాన లేదా సముద్ర తీరాన సరదాగా కూర్చొని సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసు పులకరించి, పరవశించిపోతోంది. ఇంకా ఎన్నో పాటలను వినాలని మనసు కోరుకుంటోంది. మరి అలాంటి సంగీత ప్రియులకు హుస్సేన్ సాగర్ వేదిక కానుంది. డిసెంబర్ 12వ తేదీన ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద సంగీత కచేరీ నిర్వహించనున్నారు. రామ్‌ప్రపన్న భట్టాచార్య(సితార్), ఠాకూర్ హరిజిత్ సింగ్(తబలా) కలిసి కచేరీ నిర్వహించనున్నారు. ఈ కచేరీకి హాజరయ్యేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదు. కానీ రిజిస్టేష్రన్ తప్పనిసరి. సంగీత కచేరీకి హాజరు కావాలనుకునే వారు.. బుక్ మై షో ద్వారా రిజిస్టేష్రన్ చేసుకోవచ్చు. అయితే బుద్ధ విగ్రహం వరకు బోటులో వెళ్లేందుకు కేవలం రూ. 100 మాత్రమే వసూలు చేస్తారు. ఇక రామ్‌ప్రపన్న భట్టాచార్య, ఠాకూర్ హరిజిత్ సింగ్ కలిసి ఇప్పటి వరకు పబ్లిక్ పార్కుల్లో 18 సంగీత కచేరీలు నిర్వహించారు.`