పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ









రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి

ఒక్కో ఇంటిపై ప్రభుత్వం రూ. 6 లక్షలు ఖర్చు
ఇండస్టియ్రల్‌ పార్కులో ఆదిత్య బిర్లా గ్రూపు ప్లాంట్‌కు శంకుస్థాపన
స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న సిఎం జగన్‌
కడప,డిసెంబర్‌24(జనం సాక్షి): పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు సి ఎం జగన్‌ వెల్లడిరచారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సవిూపం లోనే ఇండస్టియ్రల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సవిూపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఆక్వాహబ్‌ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పులివెందులలో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మర్కెటింగ్‌ గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులు చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు..ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. పులివెందుల ఇండస్టియ్రల్‌ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 110 కోట్ల పెట్టుబడులు..2112 మందికి ఉపాధి దక్కగలదని అన్నారు. ఇదిలావుంటే అంతకుముందు ఇడుపులపాయ లోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సిఎం జగన్‌ దంపతులు నివాళులర్పించారు.