ఉస్మానియాలో 50పడకల ఐసియు

 


త్వరలోనే అందుబాటులోకి రానున్న సౌకర్యం
క్యాథ్‌ ల్యాబ్‌, సిటి స్కాన్‌లను ప్రారంభించిన మంత్రి
రోగులకు టెస్టులను త్వరగా అందించాలన్న హరీష్‌ రావు
హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ): ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే
టెస్టులను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియాలో సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. రూ. 7 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌, రూ.2 కోట్ల 12 లక్షలతో సీటీ స్కాన్‌ను ప్రారంభించాం అని తెలిపారు. ఉస్మానియాలో రెండు సీటీ స్కాన్స్‌ ఉన్నప్పటికీ ఒకటి పని చేయడం

లేదు. ఒకటి మాత్రమే పని చేస్తోంది. మూడో సీటీ స్కాన్‌ను ఇవాళ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫెయిల్‌ అయిన సీటీ స్కాన్‌ను త్వరలోనే ఉపయోగం లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. దీంతో రోగులకు వైద్య సేవలు త్వరితగతిన అందనున్నాయి. ఉస్మానియాలో ఉన్న 180 వెంటిలేటర్లలో 102 వెంటిలేటర్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగతా వాటికి మరమ్మతు చేయాలని ఆదేశించాం. ఉస్మానియాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో కొత్త మార్చురీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు రూ. 5 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్చురీలను ఆధునికరిస్తున్నాం అని స్పష్టం చేశారు. జనవరి1న మళ్ళీ ఉస్మానియాలో పర్యటిస్తాను అని హరీశ్‌రావు చెప్పారు. ఉస్మానియాలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు పెంచాలి. ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడిటేషన్‌ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఉస్మానియా నూతన బిల్డింగ్‌పై కోర్టు కేసు తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖమ్మంలో వారం పదిరోజుల్లో క్యాథ్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌, గాంధీ ఆస్పత్రిలో, వరంగల్‌లో కూడా క్యాథ్‌ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గుండె జబ్బు రోగులకు ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిలోఫర్‌ హాస్పిటల్‌లో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌, నియోనాటల్‌ స్కిల్‌ ల్యాబ్‌ను మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు అధికారులు ఉన్నారు.