అవే మృత్యుపాశమై తండ్రీ కొడుకుల మృతి
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్7 (జనంసాక్షి) : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగులవారిగూడెం చోటు చేసుకున్నది. తండ్రీ కొడుకులయిన గ్రామానికి చెందిన పొద్దుటూరి డానియల్ (43), పొద్దుటూరు బాలు (21) తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. డానియల్ సోదరుడు విజయ్‌తో కలిసి తండ్రీ కొడులు సోమవారం రాత్రి అడవికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు అడవి జంతువుల వేటకోసం అమర్చిన కరెంటు తీగలకు తగిలి డానియల్, బాలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన విజయ్ అశ్వారావుపేట దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అయితే, విద్యుత్ తీగలు అమర్చింది ఎవరనేది తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా వన్యప్రాణుల వేట కోసమే డేనియెల్, బాలు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అశ్వారావుపేట సీఐ ఉపేంద్ర రావు, ఎస్ఐ వెంకట్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.