పిఆర్‌సిపై ఉద్యోగులతో నేరుగా చర్చించండి

 


ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు హావిూలు నెరవేర్చండి
ప్రతిష్ఠంభన తొలగించాల్సిన బాద్యత సిఎం జగన్‌పైనే ఉంది
సిఎం జగన్‌కు లేఖ రాసిన సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వద్యోగులకు 11వ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై ప్రతిష్టంభన
కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనకు ముగింపు పలకాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. దాదాపు 2 సంవత్సరాలకుపైగా పిఆర్‌సి జాప్యం చేయడం వల్ల క్రింది స్థాయిలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్వహిస్తున్న చర్చలతో మరింత జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విూరే స్వయంగా చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పిఆర్‌సి ప్రకటించాలని శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కోరారు. ఛీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక సిఫార్సులపై ఉద్యోగ సంఘాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతు న్నదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు పిఆర్‌సి వెంటనే ఇస్తామని, సిపిఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లిస్తామని, వారిని రెగ్యులరైజ్‌ చేస్తామని మేనిఫెస్టోలో హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే వారు 27శాతం ఇంటీరమ్‌ రిలీఫ్‌ తీసుకొంటున్న ఉద్యోగులు... అంతకన్నా ఎక్కువ ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరుగుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో సిఎస్‌ కమిటీ 14.29శాతం మాత్రమే సిఫార్సు చెయ్యడంపైన ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతున్నది. దీనికి తోడు ఇంటి అª`దదెల కుదింపు, సిసిఎ రద్దు, పిఆర్‌సి కాలాన్ని పొడగించడం వంటి సిఫార్సులపైనా అసంతృప్తి ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రెగ్యులర్‌గా పిఆర్‌సిలు ప్రకటించి ఉంటే ప్రస్తుతం 13వ పిఆర్‌సి అమలు కావాలి. కానీ జరిగిన జాప్యం వలన ఉద్యోగులు10 సంవత్సరాలు అనగా 2 పిఆర్‌సిల కాలాన్ని కోల్పోయారు. ప్రస్తుతం 11వ పిఆర్‌సిలోనైనా పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు తగిన విధంగా వేతన పెంపు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చెయ్యాల్సింది ఉద్యోగులే. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఈ కృషిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, టైం స్కేల్‌, కంటింజెంట్‌, డైలీవేజ్‌ ఉద్యోగులు కూడా పాలుపంచు కొంటున్నారు. వీరందరికీ సకాలంలో పిఆర్‌సి అమలు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నదని, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రే స్వయంగా చర్చలు జరిపి పిఆర్‌సితో పాటు ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.