జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్ల రద్దు

యూటిఎఫ్‌ ఆరోపణలతో చర్యలు

చిత్తూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్లు రద్దయ్యాయి. యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ యూటీఎఫ్‌ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. ఈ మేరకు చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అధ్యాపకుల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లాలో డిప్యుటేషన్లు చట్టవిరుద్ధమని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌.. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తగు చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ కోరింది. దాంతో జిల్లాలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఏపీ పాఠశాల విద్యా శాఖ చిత్తూరు డీఈఓను ఆదేశించింది. దీంతో డిప్యూటేషన్లన్నింటినీ రద్దు చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ డిప్యూటేషన్లకు వ్యతిరేకంగా యుటిఎఫ్‌ గతంలో నిరసనలు నిర్వహించింది. అలాగే చిత్తూరులోని డీఈవో కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ వై శ్రీనివాసులురెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు భారీ ధర్నా నిర్వహించారు.