కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూత


మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు

ధృవీకరించిన వైమానిక దళం
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి
బెంగళూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తమిళనాడు మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కూడా కన్నుమూశారు. బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌లో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన మృతిని వైమానిక దళం ధృవీకరించింది. ఆయనకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. వరుణ్‌ సింగ్‌ కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థనలు చేశారు. ఆయన తల్లిదండ్రులు బెంగళూరులోనే ఉండి కుమారుడి కోసం ఎదురు చూశారు. వరుణ్‌ సింగ్‌ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నెల8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ కూప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్‌ సింగ్‌ మరణంతో ఆ సంఖ్య 14కు చేరింది. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు 11మంది మరణించారు. కానీ ఈ దుర్ఘటన నుంచి బయటపడిన ఒకే ఒక్కడు వరుణ్‌ సింగ్‌. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స కోసం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి బెంగళూరు కమాండో ఆస్పత్రికి తరలించారు. మొత్తం 85 శాతం కాలిన గాయాలు కావడంతో వారం రోజులుగా చికిత్స అందించినా కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. చివరకు ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇండియన్‌ ఆర్మీలో విశేష సేలందించిన వరుణ్‌ సింగ్‌..ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరుణ్‌ సింగ్‌ సేవలు దేశానికి గర్వకారణం, ఆయన పరాక్రమంతో అత్యంత వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతి పట్ల తీవ్ర మనో వేదనకు లోనయ్యానని. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది. అతని కుటుంబ సభ్యులకు,స్నేహితులకు సంతాపం. ఓం శాంతి. అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.