సింగరేణి పరిరక్షణకు యద్ధానికైనా సిద్ధం


` కార్మిక సంఘాలు
` జనవరి 20న మరోసారి సమావేశం
` 3 రోజుల సమ్మె విజయవంతం
` నేటినుంచి విధుల్లోకి కార్మికులు
గోదావరిఖని, డిసెంబర్‌ 11, (జనంసాక్షి):హైదరాబాద్‌: రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు ముగిశాయి. జనవరి 20న మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేటి నుంచి నుంచి సింగరేణి కార్మికులు విధుల్లోకి వెళ్లనున్నారు.కాగా కేంద్రంలో మోడీ సర్కార్‌ దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను కార్పొరేట్‌ శక్తులకు అప్పచెప్పేందుకు అంగీకారం కుదుర్చుకుందని..అందులో భాగంగా సింగరేణి నాలుగు బ్లాకులను వేలం పాటకు పిలిచారని ఎఐసిటియు,ఎఐఎఫ్‌టియు నాయకులు తెలిపారు.నాలుగు జాతీయ సంఘాలతో పాటు, గుర్తింపు సంఘం టిబిజికెఎస్‌ కూడా సమ్మె నోటీసు ఇచ్చిందని తెలిపారు.అలాగే విప్లవ కార్మిక సంఘాలు కూడా సమ్మె నోటీసు ఇచ్చాయన్నారు.కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో 72 గంటల సమ్మె విజయవంతం అయ్యిందన్నారు. సమ్మె విజయవంతం చేసిన సింగరేణి కార్మికులకు శనివారం గోదావరినిలో జరిగిన కార్యక్రమంలో విప్లవ జేజేలు తెలుపుతూ, ఇదే స్ఫూర్తిని రాబోయే రోజులలో కార్మిక వర్గం పోరాటం చేయాలని ఎఐసిటియు,ఎఐఎఫ్టియు పిలుపునిచ్చింది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆర్‌సి సింగరేణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటా 49శాతం పూర్తిగా కొని సింగరేణి పరిరక్షణ కాపాడుతానని హామీ ఇచ్చారని,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన వాటా కార్పొరేట్‌ శక్తులకు అంగీకరించింది వెంటనే నిలుపుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎఐసిటియు,ఎఐఎఫ్టియు డిమాండ్‌ చేస్తున్నామన్నారు.అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.పార్లమెంట్‌,రాజ్యసభలో మన తెలంగాణ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ ముక్త కంఠంతో మాట్లాడి సింగరేణిలోని నాలుగు బ్లాక్‌ల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని రక్షించాలని డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. లెని ఎడల జరగబోవు దీర్ఘకాలిక సమ్మెకు పూర్తి బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వహించాల్సి వుంటుందని ఎఐసిటియు రాష్ట్ర అధ్యక్షులు ఎంఎ గౌస్‌, ఎఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్చరించారు.
ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం ..
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇతర కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో మూడు రోజుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికవర్గానికి జేఏసీ, ఏఐటియుసి పక్షాన అభినందనలు తెలుపుతున్నామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య అన్నారు.శనివారం ఆర్జీ`వన్‌ ఏరియా గనులు, మేడిపల్లి ఓసిపి వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.జేఏసీ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు.లాభాల్లో ఉన్న సింగరేణి లో నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓపెన్‌ టెండర్‌ ప్రక్రియ ద్వారా ఇవ్వడాన్ని కార్మిక వర్గం వ్యతిరేకిస్తుందన్నారు.మూడు రోజుల సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారని ఆయన అన్నారు.130 సంవత్సరాలకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కల్గిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి బిఐఎఫ్‌ఆర్‌కు పోతే, సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి పెంచి లాభాల్లో కి తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులను చెల్లిస్తూ, 2000 సంవత్సరం నుండి దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వకున్నా..సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు లాభాల్లో వాటాను పది శాతం నుండి 29 శాతం వరకు పొందారని ఆయన అన్నారు.తెలంగాణ లో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్‌ తెలంగాణ ప్రాంతానికి తల్లి లాంటిదని ఆయన అన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమోచ్చిందని ఆయన విమర్శించారు.ఈ నెల 13 న వేలం పాటలో సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటు వారికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వాటిని తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.లేనిచో సింగరేణి లో కార్మిక వర్గాన్ని చైతన్య పరిచి ఐక్య పోరాటాలకు పిలుపు నిలుస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.