ఆస్తికోసం మహిళ పైశాచికం..


తల్లీబిడ్డల సజీవ దహనం

మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత
పాట్నా,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య చేసింది. చనిపోతున్న వారి కేకలు విని చుట్టుపక్కలవారు వచ్చిచూడగా.. ఆ మహిళ ఇంకా కిరోసిన్‌ పోస్తూనే ఉంది. ఆమెను జనం పట్టుకొని చితకబాది.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. బీహార్‌ రాజధాని పట్నాలో గురువారం మాధురి దేవి అనే మహిళ వృద్దురాలైన తన చిన్నమ్మ, ఆమె కొడుకుని ఆస్తి కోసం హత్య చేసింది. ఆమె హత్య చేస్తుండగా.. ఇరుగుపొరుగన వారు పట్టుకున్నారు. కానీ అప్పటికే తల్లీకొడుకులు చనిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాధురీ దేవిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్నాకు చెందిన శాంతి దేవి(70) అనే వృద్ధ మహిళ ఒక అనాధ. తన భర్త లాల్‌ దాస్‌ మరణించిన తరువాత సంతానం లేని ఆమె ఒక 11 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకుంది. తాను మరణించిన తరువాత తన ఆస్తి మొత్తం ఆ బాలుడికే చెందాలని శాంతి దవి వీలునామా రాసింది. కానీ శాంతి దేవి ఇలా ఆస్తి ఒక దత్త పుత్రుడికి ఇచ్చేయడంతో ఆమె బంధువులు కోపడ్డారు. ముఖ్యంగా శాంతి దేవి భర్త సోదరుడి కూతురు మాధురీ దేవి ఈ విషయంలో ఇంటికొచ్చి గొడవ చేసింది.దీంతో శాంతి దేవి తను నివాసముంటున్న ఇల్లు మినహా మిగతా ఆస్తి మొత్తం విక్రయించేసింది. ఇది తెలిసిన మాధురీ దేవి మళ్లీ శాంతి దేవి ఇంటికొచ్చి గొడవ చేసింది. తన చిన్నాన్న ఆస్తి మొత్తం తనకే చెందుతుందని.. అలా కాకుండా మరొకరికి కట్టపెడితే చంపేస్తానని బెదిరించింది. ఆ బెదిరింపులకు భయపడని శాంతి దేవి.. ఆమెతో గొడవ పడిరది. గొడవ ముదిరి ఆవేశంలో మాధురీ దేవి.. శాంతి దేవి, ఆమె దత్త పుత్రుడైన 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. అనంతరం వారిద్దరిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. అలా ఇంట్లోనుంచి పొగ రావడంతో పొరుగింటి వారు హుటాహుటిన అక్కడికి వచ్చారు. అక్కడ శాంతిదేవి మంటల్లో కాలిపోతుండగా.. మాధురీ దేవి మరింత కిరోసిన పోస్తూ ఉంది. ఇది చూసిన చుట్టు పక్కల వారు ఆమెను పట్టుకొని చితకబాది ఒక స్తంభానికి కట్టేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాధురీ దేవిని అరెస్టు చేసి ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.