టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదని నిరూపించారన్న ఎర్రబెల్లి
కెసిఆర్ నాయకత్వంపై విశ్వాసం పెరిగిందన్న సత్యవతి
హైదరాబాద్,డిసెంబర్14(జనంసాక్షి ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమని, టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. శాసనమండలి లోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికలలో మొత్తం 12 స్థానాలూ గెలిచి, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణమని చెప్పారు. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవం కాగా, పోలింగ్ జరిగిన ఆరింటిలో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల నాయకత్వం పట్ల, వారి పరిపాలనా పటిమ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారిని కూడా అభినందించారు. రాష్ట్ర ప్రజానీకం యావత్తు టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు, నాయకులకు, శ్రేణులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయాలతో మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్‌ఎస్‌కు కొండంత అండ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్ పార్టీదే అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక సంస్థలకు
జరిగిన 12 స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, నేడు ఎన్నిక జరిగిన మరో ఆరుగురు అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు అభ్యర్థులు భానుప్రసాదరావు, ఎల్. రమణ, దండే విఠల్, యాదవరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డి, తాతా మధులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూధనా చారి కూడా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్‌కు మద్దతు పలికిన స్థానిక సంస్థల సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.