భారత్‌లో యాంటీబాడీలు అధికం

 
` కొవిడ్‌ విజృంభించకపోవచ్చు
` సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా వెల్లడి
` నగరాల్లో 90శాతం యాంటీబాడీలు
` దేశంలో 70 నుంచి 80శాతం సీరోపాజిటివిటీ రేట్‌ కలిగిఉంది
దిల్లీ,డిసెంబరు 11(జనంసాక్షి):కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంటుంటే.. ఒమిక్రాన్‌ రూపంలో వైరస్‌ షాకిచ్చింది. దాంతో వ్యాక్సినేషన్‌ రేటు పెరగాల్సిన ఆవశ్యకతను, కొవిడ్‌ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్తున్నారు. ఈ కొత్త కలవరం వేళ.. భారత్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.. అదే సీరోపాజిటివిటీ రేటు. అధికస్థాయిలో ఉన్న ఈ సీరోపాజిటివిటీ రేటు వల్ల భారతీయులు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది.‘భారతదేశం 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటును కలిగి ఉంది. ఒమిక్రాన్‌ వేళ.. ఇది దేశానికి ఒక సానుకూలత. నగరాల్లో 90 శాతానికి పైగా ప్రజలు ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు’ అని సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఓ విూడియా సంస్థతో అన్నారు. ఈ ప్రతిరోధకాలను కలిగి ఉండటం మూలానా.. ప్రజలు వ్యాధి బారినపడినప్పటికీ, లక్షణాలు చాలా స్వల్పంగా ఉండనున్నాయన్నారు. ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చని అంచనావేశారు. టీకా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి, చిన్నారులకు కూడా టీకాలు అందజేస్తే.. పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందన్నారు.అలాగే వైరస్‌ భారీస్థాయిలో ప్రబలకుండా ఉండాలంటే మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌ నియమావళిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మూడో ముప్పు వస్తుందన్న అంచనాలపై ఆయన స్పందించారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా పలు దఫాలుగా వైరస్‌ విజృంభించొచ్చన్నారు. అయితే ఎక్కువ మందిలో ప్రతిరోధకాలు ఉండటంతో.. తీవ్ర లక్షణాలకు ఆస్కారం ఉండకపోవచ్చన్నారు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం స్వల్ప స్థాయిలో మరో దఫా వైరస్‌ విజృంభిస్తుందని హెచ్చరించారు. కొత్త వేరియంట్లు వల్ల తేలికపాటి లక్షణాలు, వైరస్‌ వేగంగా ప్రబలడమనేది సాధారణమేన్నారు. అయితే ఒక్కోసారి భారీ ప్రమాదాన్ని తీసుకువచ్చే వేరియంట్లు కూడా వెలుగుచూడొచ్చని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ దాదాపు 60 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో 33 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ బాధితుల్లో తీవ్ర లక్షణాల ఆనవాళ్లు కనిపించలేదు. ఆ విషయం ఊరటనిస్తున్నప్పటికీ.. ఈ వేరియంట్‌ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని ప్రారంభ నివేదికలను బట్టి వెల్లడవుతోంది. అందుకే నిర్లక్ష్యం వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రజల్ని హెచ్చరిస్తున్నాయి.