పట్టుబడ్డ నకిలీ సిబిఐ దొంగలు

ఇంటిదొంగల పనేనని గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): గచ్చిబౌలి నకిలీ సీబీఐ దొంగలు పట్టుబడ్డారు. గచ్చిబౌలి ఆరంజ్‌ కౌంటీలో సిబిఐ అధికారులమంటూ చొరబడి బంగారం,నగదు కాజేసిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా నకిలీ ఐడి కార్డ్స్‌ సృష్టించి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపరంలో సంవత్సరం క్రితం పని చేసిన వ్యక్తులే కావడం గమనార్హం. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారు. చోరికి గురైన సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ యజమాని సుబ్రహ్మణ్యం దగ్గరే పనిచేస్తున్న జశ్వంత్‌ అనే వ్యక్తి కీలక నిందితుడిగా పోలీసులు గుర్తంచారు. జశ్వంత్‌ తన స్నేహితుడు సందీప్‌ తో కలిసి ఈ దోపిడికి ప్లాన్‌ వేశాడు. తన యజమాని వద్ద భారీగా బ్లాక్‌ మనీ ఉందని ఈ ప్లాన్‌ వేశాడు జశ్వంత్‌. దొంగతనం చేసినా యజమాని ఫిర్యాదు చేయడని జశ్వంత్‌ అనుకున్నాడు. మొత్తం ఎనిమిది మందితో కలిసి యజమాని ఇంట్లో దొంగతనానికి ప్రణాళిక రచించాడు. ఈ ముఠా అంతా ఓ ట్రావెల్స్‌ కారు మాట్లాడుకుని వచ్చారు. కారుకు నంబర్‌ ప్లేట్‌ మార్చారు. రెండు నెలల నుంచి ఈ పనికి ప్లాన్‌ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్‌ ఎస్వోటి పోలీసులు విచారిస్తున్నారు.