అన్నదాతల దోపిడీ ఇంకెంతకాలం !

  

ఏటా పంటల సమయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ ఎరుకే. పంట ఎలా అమ్ముకో వాలన్నదే రైతుల ఆందోళన. పంటల మాటున వారిని ఎలా దోచుకోవాలన్నది మిల్లర్లు, దళారులకు ఎరుక. ఎంత తక్కువ ధరలకు కొంటే ఎంత దోచుకోవచ్చో దళారులకు బాగా తెలుసు. అలాగే ఎంత తరుగు తీస్తే ఎంతా ఆదాయం వస్తుందో మిల్లర్లకు తెలుసు. సందెట్లో సడేమియ్యాల్లా మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అంతో ఇంతో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. పత్తి కావచ్చు...వరి కావచ్చు..మక్కజొన్న లేదా మరే ఇతర పంటయినా కానీయండి..దోపడీ మాత్రం నిత్యకృత్యం. వీరందరికి పప్పుబెల్లాల్లా పంపిణీ చేసి వచ్చిన ఆదాయంతో రైతులు మళ్లీ కొత్తగా వ్యవసాయం చేయడం కూడా యధాలాపంగా సాగుతోంది. ఇంతగా దోపిడీ జరుగుతున్నా రైతులు తిరగబడడం లేదు. వ్యవసాయం మనకెందుకులే అని కాడి పారేయడం లేదు. ఎందుకంటే తమకు తెలిసిన ఈ పనితో నలుగురికి అన్నం పెట్టడమే తెలుసు కనుక. ఇవన్నీ పాలకు లకు కూడా తెలుసు. దోపిడీ ఎలా జరుగుతుందో కూడా తెలుసు. దోచింది ఎవరెవరు ఎంతెంత పంచుకుం టారో తెలుసు. అయినా రైతులకు మద్దతుగా పాలకులు, అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. సమయానికి పంటలను కొనుగోలు చేస్తే చాలన్న ఒక్క కోరికను నెరవేర్చడం లేదు. పంటలను అమ్ముకో వడం నేరమన్నరీతిలో వారిని పురుగుల్లా చూస్తున్నారు. అధికారంలో ఉన్న కలెక్టర్లు కావచ్చు...ఇతర రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు కావచ్చు..ఎవరు కూడా రైతులకు మద్దతుగా నిలబడి దోపిడీని అరికట్టలేకపోతున్నారు. ఇదంతా కళ్లముందు కనిపిస్తున్న దోపిడీ. ఈక్రమంలోనే పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు ఎందరో ఉన్నారు. వ్యవసాయంలో ఓడిపోకున్నా పంట అమ్మకంలో ఓటమితో ఉసురు తీసుకుంటున్నారు. అయినా పాలకులు కళ్లు తెరవడం లేదు. వడ్లు వేస్తే అమ్ముడవుతాయో లేదో తెలియదు. ఏ పంట వేసినా ఖచ్చితంగా అమ్ముకుంటామన్న ధైర్యం లేదు. ఇలా మనందరికి అన్నం పెట్టే రైతన్నలను మనమంతా కలసి కాకుల్లా పొడుచుకుతింటున్నాం. అందుకే వారి ఇళ్లల్లో ధనరాసుల బదులు కన్నీటి రాసులు కానవస్తాయి. అప్పుల బాధలకు తోడు నాయకు ల తీరు మరీ కుంగదీస్తోంది. ఏ పంట పండిరచాలో..ఏది పండిరచ కూడదో స్పష్టమైన విధానం లేదు. ఆ మట్టి మనుషులను ఆదుకుని...వారికి అండగా నిలవాల్సిన ప్రతి ఒక్కరూ వారిని ఆదాయవనరుగా చూస్తూ దోచుకుంటున్నారు. ఇలా కష్టాలు భరించలేని .. పంట పండిరచడం తప్ప వేరే కుతంత్రాలు తెలియని అన్నదాతలు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నరు. పంట దిగుబడి రాక కొందరు.. కొనుగోళ్లు జరగక ఇంకొందరు..యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు..ఇలా గడిచిన కొంతకాలంగా అనేకులు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. కొందరు గుండె ఆగి చస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయి ఆ అన్నదాతల కుటుంబాలు రోడ్డునపడుతున్నయి. వానాకాలంలో పండిన వడ్లను ప్రభుత్వం సకాలంలో కొనకపోవడం వల్లే ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు. దసరా, దీపావళి నుంచే వడ్లు మార్కెట్‌లోకి రావడం మొదలైనా కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు. ఆయా గ్రామాల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు, కార్యాలయాల మట్టడి ఇందుకు నిదర్శనంగా చూడాలి. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నా ఆ మేరకు దిగుబడులు రాక రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరకపోతున్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదు. ధరలు పెరిగితే వ్యాపారులు లాభ పడుతున్నారు. సామాన్యులు కూడా దగా పడుతున్నారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలు
సాగుచేస్తున్నా, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదు. ఈసారి పత్తికి మంచి రేటు ఉన్నప్పటికీ, వర్షాలతో పత్తి పూర్తిగా దెబ్బతిని దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు కనీసం 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే 3 క్వింటాళ్లే వచ్చింది. కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి. దీంతో నాలుగైదు ఎకరాలు సాగుచేసే బడుగు రైతుల్లో ఒక్కొక్కరి నెత్తిపై రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా అప్పు ఉంటోందని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. దీనికి తోడు పిల్లల చదువులు, వారి పెండ్లిళ్లు, ఇతరత్రా ఖర్చులు కూడా కలిసి రుణభారం తడిసిమోపెడవుతోంది. అప్పు తీర్చే మార్గం కనిపించని రైతులు తీవ్ర ఒత్తిడికి గురై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి రోగాలపాలై చనిపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చిన రైతులు వారాలు, నెలల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఆందోళన చెందిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడం, వరదల్లో కొట్టుకు పోవడం, చీడపీడల వల్ల దిగుబడి తగ్గడం లాంటి కారణాల వల్లే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. గడిచిన మూడేండ్లుగా రైతులు భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్దమొత్తంలో పంటలు నష్ట పోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారుల నివేదికలే వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో రైతులను ఆదుకునే లక్ష్యంతో సమగ్ర బీమా పథకాలు అందుబాటులో లేవు. బీమా కంపెనీల నుంచి కూడా రైతులకు పరిహారం అందడం లేదు. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండిరచిన పంటలు భారీ వర్షాలు, వరదలకు కండ్ల ముందే కొట్టుకుపోతుంటే ఆదుకునే దిక్కులేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు పలురకాల పథకాలు అమలవుతున్నా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారు తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు8 సమగ్ర అధ్యయనం చేయాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. రైతుల అభిప్రాయాలను తీసుకోవాలి. వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మాలచాలి. వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా బలోపేతం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతో అటు వ్యవసాయంతో పాటు ఉపాధిరంగం కూడా పురోగమిస్తుంది. అలా చేస్తేనే అన్నదాతలను గట్టెక్కించి గ్రావిూణ ఆర్థికరంగాన్ని బలోపేతం చేయగలుగుతాం.