క్రమంగా పెరుగుతున్న చలి

 



ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
విశాఖ మన్యంలో మంచు తెరలు
హైదరాబాద్‌/విశాఖపట్టణం,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లా సిర్పూర్‌ లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో 8 నుంచి 10 డిగ్రీలే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకూ అదనంగా పెరిగిందని ఆమె తెలిపారు. లంబసింగిలో అందాలు ఆరబోస్తున్నాయి. మబ్బులు భూమిని కమ్మేస్తున్నాయి. విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. దీనికితోడు చలిపంజా విసరుతోంది. ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఏజెన్సీలకి వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. రాత్రిపూట, తెల్లవారుజాము ఈ సీజన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తున్న కారణంగా జిల్లాలో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని వాతావరణ అధికారులు అన్నారు. ఈ ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి. రాత్రి, ఉదయం సమయాల్లో కంటే తెల్లవారుజామున అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో చలికితోడు పొగమంచు సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో 15 విూటర్లకు మించి కనిపించడం లేదు. దీంతో ఉదయం 7 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వాతావరణంలో ఈ సారి మార్పులు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో పనులపై బయటికి వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయాన్నే పాల వ్యాపారులు, పేపర్‌ బాయ్స్‌ చలిలో వణుకుతూనే పనులు చేసుకుంటున్నారు. సూర్యోదయం అయినా పొగమంచు వీడడం లేదు. దీంతో స్వెట్టర్లు, ఇతరత్రా ఉన్ని దుస్తులు ధరించి బయటికి వస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలిలో బయటికి రావడానికి జంకుతున్నారు. అస్తమా వ్యాధి గ్రస్తులపైనా చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జనం ఉదయం పూట చలిమంటలు వేసుకుంటున్నారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు
తున్నాయి. ఉత్తర భారతం నుంచి వీచే అతి శీతల పవనాలు ముందుగా జిల్లాను తాకడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం కనిష్ఠంగా నమోదవుతున్నాయి. జనవరి మాసం వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడి జిల్లాపై ప్రభావం చూపితే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం మేఘావృతమైతే చలి తీవ్రత కొంత వరకు తగ్గే అవకాశాలుంటాయి. అలాగే వరంగల్‌,ఖమ్మం, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీల్లో క్రమంగా చలి పెరుగుతోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.