టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు


మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో యువకుల చేరిక
మహబూబాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 200 మంది యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా తొర్రూరు పాల కేంద్రం నుంచి పార్టీ ఆఫీస్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి బైక్‌ పై కూర్చుని అందరినీ ఉత్సాహపరిచారు. రాహుల్‌ రాయ్‌ (బంటి) అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..దేశంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కేసీఆర్‌ అనుభవంతో కూడిన దిశా నిర్దేశర, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కేటీఆర్‌ లీడర్షిప్‌ ఉన్న పార్టీ అని ప్రశంసించారు.
విష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.